ఆమె వయసు 30ఏళ్లు.. పెళ్లయింది.. మంచి భర్త.. ఇద్దరు పిల్లలు ఉన్నారు… ఆ కుర్రాడి వయసు 22 ఏళ్లు.. పెళ్లి కాలేదు.. చదువు మధ్యలో ఆపేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో పరిచయం ఏర్పడింది.. ఈ పరిచయం కాస్త.. ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లపాటు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఇరు కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో అనైతిక బంధం కాస్త ఇద్దరి జీవితాలూ అంతమయ్యేలా చేసింది.. దీనివల్ల రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకుంది..
నిమిషాల వ్యవధిలోనే ఓ వివాహిత, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఒకే రోజు జరిగిన ఈ రెండు ఘటనలతో కృష్ణాపురంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.. సమాచారం అందుకున్న పోలీసులు రెండు కుటుంబాల ఫిర్యాదులతో విచారణ చేపట్టారు.
కాగా.. ఈ ఘటనలపై పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఫోన్ రికార్డింగ్‌లు, చాటింగ్‌లు కీలకంగా మారాయి. కలిసి జీవించడం సాధ్యం కాదని.. క్షణికావేశంలో ఆదిత్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా వెను వెంటనే.. లక్ష్మి సైతం తన ఇంటిలో ఉరేసుకొని మృతి చెందింది. ఆదిత్య ఉరేసుకునే సమయంలో లక్ష్మికి వీడియోకాల్ చేయడంతో భయపడి తను కూడా ఉరేసుకొని మృతి చెందిందని పోలీసులు తెలిపారు. అయితే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లు పేర్కొంటున్నారు.
మంగళవారం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం లక్ష్మి, ఆదిత్య మృతదేహాల్ని విడివిడిగా గ్రామానికి తీసుకొచ్చి గ్రామ శివారు గోస్తనీ నదీ తీరంలోని శ్మశాన వాటికలో విడివిడిగా దహనం చేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు సోమవారం, మంగళవారం పికెట్ నిర్వహించారు.
ఆత్మహత్యలకు గల కారణాలపై ఇంకా దర్యాప్తు చేస్తున్నామని.. సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పద్మనాభం పోలీస్ స్టేషన్ సి.ఐ సి.హెచ్.శ్రీధర్ తెలిపారు. బంధుమిత్రులను విచారిస్తున్నామని తెలిపారు.
ఓ అక్రమ సంబంధం రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.. ఆమె మృతితో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరం కాగా.. అతడి మృతితో వృద్ధాప్యంలో ఆసరా అవుతాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు అర్థాంతరంగా తనువు చాలించాడు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..