మనలో కొందరి ఇళ్లలో చీడపురుగుల బాధ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బొద్దింకలు, బల్లులు, ఇతర చిన్న చిన్న కీటకాలు ఇంట్లోకి చొరబడతాయి. ఇవి కేవలం ఇంటి శుభ్రతను మాత్రమే కాదు.. ఆరోగ్యానికీ కూడా ముప్పుగా మారతాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న రసాయనాలు చీడపురుగులను తొలగించేందుకు ఉపయోగపడతాయి కానీ.. అవి మన ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందుకే ఇంట్లోనే సహజమైన పదార్థాలతో వీటిని తరిమికొట్టే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెప్పర్ స్ప్రే
పెప్పర్ స్ప్రే చీడపురుగులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒకవేళ పెప్పర్ స్ప్రే అందుబాటులో లేకపోతే.. ఇంట్లో మిరియాలను పొడి చేసి నీళ్లతో కలిపి స్ప్రేగా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇంటి మూలల్లో బొద్దింకలు కనిపించే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే అవి మళ్లీ రాకుండా ఉంటాయి.
లవంగాలు
ఇంట్లో లవంగాలు ఉంచడం ద్వారా బొద్దింకలు, ఇతర చిన్న పురుగులను నివారించవచ్చు. లవంగాల వాసనకు కీటకాలు దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇంట్లోని మూలల్లో లేదా బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో లవంగాలను ఉంచితే అవి త్వరగా పారిపోతాయి. ఈ సహజ చిట్కాలను పాటిస్తే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు.
గుడ్డు పెంకులు
ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరుగుతున్న ప్లేస్ లో గుడ్డు పెంకులను పెట్టండి. బల్లులు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో, ముఖ్యంగా కిటికీల దగ్గర గుడ్డు పెంకులను ఉంచితే అవి రాకుండా ఉంటాయి. గుడ్డు పెంకుల నుంచి వచ్చే వాసన బల్లులను ఆకర్షించదు. అందుకే అవి ఆ ప్రదేశాన్ని విడిచిపెడతాయి.
ఉల్లి, వెల్లుల్లితో చెక్ పెట్టండిలా..!
బల్లులను తరిమికొట్టడానికి ఉల్లిపాయ పొరలు, వెల్లుల్లి తొక్కలు ఉపయోగపడతాయి. కిటికీల చుట్టూ లేదా తలుపుల పక్కన వీటిని ఉంచితే బల్లులు దరిచేరవు. ఇవి కేవలం బల్లులకు మాత్రమే కాదు. ఇతర చీడపురుగులకు కూడా అడ్డుకట్ట వేస్తాయి.
బొద్దింకలకు నాప్తలీన్ బాల్స్
బొద్దింకలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో నాప్తలీన్ బాల్స్ ఉంచితే అవి రాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా సింక్ కింద, మూలల్లో ఉంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఈ బాల్స్ పిల్లలకు అందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.