అడవుల జిల్లా అదిలాబాద్ పరిసర ప్రాంతాలను పులుల సంచారం వణికిస్తోంది. ఇంట్లోనుంచి ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులకు పెద్దపులి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో పులి సంచారం ఆ ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల తరచూ పెద్దపులులు, చిరుతలు జనావాసాల్లోకి చొరబడుతూ పశువులను బలితీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మనుషులపై కూడా దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కెమికల్ ఏరియా, కాల్‌టెక్స్ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు గుర్తించారు స్థానికులు. ఈ నేపథ్యంలో ఇళ్లనుంచి జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏక్షణంలో ఎవరిపై పులి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పులిసంచారంతో బెల్లంపల్లి పట్టణ సమీపంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్ధులను బయటకు పంపించవద్దని పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులకు సూచించారు. మరోవైపు పులిసంచారం గురించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది పులి పాదముద్రలను గుర్తించారు. పులి సంచరిస్తున్న క్రమంలో ప్రజలు ఒంటరిగా బయట తిరగవద్దని, పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు గుంపులుగా వెళ్లాలని సూచించారు. రాత్రి వేళ ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..