అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్ పరిధిలో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా సాగిపోతున్నాయి. విలువైన రంగు రాళ్లు కోసం తిష్ట వేసి తవ్వకాలు చేసేస్తున్నారు. ఏకంగా కుటుంబానికి కుటుంబమే వాలిపోయి.. తవ్వేస్తున్నారు. సిగినాపల్లి క్వారీ వద్ద వెతుకులాట చేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులకు కీలక సమాచారం అందింది. దీంతో ఆకస్మిక దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పదిమందిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి చెందిన వారుగా గుర్తించారు. 2.2 గ్రాముల విలువైన రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆ రంగు రాళ్లు చూస్తే మిలమిలా మెరిసిపోతున్నాయి. వాటి విలువ లక్షల్లోనే ఉంటుందని అంచనా. వాటితోపాటు తవ్వకాలకు వినియోగించిన పరికరాలు సీజ్ చేశారు. పర్యవేక్షణ లోపం కారణంగా ఇద్దరు కాంట్రాక్టర్ ఉద్యోగుల విధుల నుంచి తొలగించారు అటవీ శాఖ అధికారులు. నిందితులు పదిమందిని అరెస్టు చేశామని అన్నారు అటవీ రేంజ్ అధికారిణి శివరంజని. క్వారీ వద్ద బేస్ క్యాంప్, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పహరా కొనసాగుతుందన్నారు.
అసలు రంగురాళ్లు ఎలా ఏర్పడతాయి….
రంగురాళ్లు ఏర్పడటం అనేది వందల ఏళ్ల కొలది జరిగే ప్రక్రియ. భౌగోళిక పరిస్థితుల కారణంగా.. ఆయా ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతల ఫలితంగా అక్కడి రాళ్లు సంగ్రహించే కాంతిని బట్టి వాటికి ప్రత్యేక లక్షణాలు వస్తాయి. అవి అలా రూపాంతరం చెందుతాయి. దాంతో ఆ రాళ్ల అంతర్గత లక్షణాలు, ఉపరితల రంగు విషయంలో మార్పులు సంభవిస్తాయి. దీంతో అవి ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంటాయి. వాటినే రంగురాళ్లు అంటారు. తూర్పు కనుమల్లో ఈ రంగురాళ్ల లభ్యత ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి