హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంజినీరింగ్, ఫార్మా, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు పూర్తి నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి (TGCHE) గురువారం విడుదల చేసింది. ఇందుకోసం జేఎన్‌టీయూహెచ్ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2,500, రూ.5 వేల ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారికి హైదరాబాద్‌లోని జోన్ 4లో మాత్రమే పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.
ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంటర్‌లో 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్ధులకు తప్పనిసరిగా.. 2025 డిసెంబరు 31 నాటికి 16 సంవత్సరాలు నిండాలి. గరిష్ఠ వయో పరిమితి లేదు. అయితే బీటెక్ డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్‌కు 2025 డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఈ కోర్సుల్లో చేరేందుకు ఎస్సీ, ఎస్టీలకు 25, ఇతరులకు 22 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిగా నిర్ణయించారు. బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో చేరాలంటే ఎప్‌సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీవిభాగం పరీక్ష తప్పనిసరిగా రాయాలంటూ ప్రభుత్వం పేర్కొంది. బీఫార్మసీ, ఫార్మా-డితోపాటు బీటెక్ బయోమెడికల్, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్‌సీట్లను ఎంపీసీ, బైపీసీ గ్రూపు విద్యార్థులకు చెరి సగం కేటాయిస్తారు. బయోమెడికల్, ఫార్మాసూటికల్ కోర్సులు గతేడాది కూడా ఉన్నా వీటిలో సగం సీట్లు ఎంపీసీ విద్యార్థులకు ఇస్తారని ఈసారి నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 చట్టం మేరకు పదేళ్ల ఉమ్మడి ప్రవేశాలకు గతేడాదితో గడువు ముగియడంతో.. ప్రవేశాల నాటికి ప్రభుత్వం జారీ చేసే జీవో ఆధారంగా అర్హత, ప్రవేశాలు లోబడి ఉంటాయని పేర్కొంది. దీంతో ఈ ఏడాది తెలంగాణ ఈఏపీసెట్ 2025 పరీక్ష రాయాలా? వద్దా? అనే దానిపై ఏపీ విద్యార్ధుల్లో గందరగోళం నెలకొంది. నాన్ లోకల్ కోటా విభాగంలో ప్రవేశాలకు సంబంధించి అర్‌హతలపై ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవవడమే ఇందుకు కారణం. దీంతో ఈఏపీసెట్ అధికారులు కూడా అస్పష్టంగానే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకు లోబడే 15 శాతం నాన్ లోకల్ విభాగంలో ప్రవేశాలు ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొనడం గమనార్హం. అయితే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే లోపు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తుందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. సిలబస్, కోర్సులు తదితర పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.