హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అయితే పదో తరగతి పరీక్షల అనంతరం రిజల్ట్స్ గ్రేడింగ్‌లో ఇవ్వాలా? లేదా మార్కులు ఇవ్వాలా? అనే దానిపై విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. గతంలో ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. విద్యార్థులకు అందించే మెమోలను ఎలా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తేల్చుకోలేకపోతుంది.
మార్కుల మెమోలను ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తల బాదుకుంటుంది. దీనిపై సూచనలు, సలహాలు స్వీకరించేందుకు హెచ్‌ఎంలు, నిపుణులతో సోమవారం సమావేశం జరిపింది. ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని ఎత్తి వేశారు. గతంలో మార్కుల విధానం అమలైనప్పుడు విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, పాస్ అని మెమోలపై ముద్రించేవారు. అలాగే మార్కులతోనే టెన్త్ మెమోలను ముద్రించాల్సి ఉంటుంది.
అయితే ఈ పాత విధానాన్ని కొనసాగించాలా? లేదా ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు ముద్రించాలా? అన్న దిశగా చర్చలు సాగించారు. వీటిపై ఓ నిర్ణయానికి వచ్చిన అధికారులు వాటిపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. ప్రభుత్వం ఆమోదిస్తే తదనుగుణంగా టెన్త్ మెమోలను ముద్రించడం జరుగుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.