Hyderabad: ఎదుటి వారి అత్యశే.. అతనికి క్యాష్ అయింది.. పుల్లయ్య టోకరా మామూలుగా లేదుగా..

Hyderabad: ఎదుటి వారి అత్యశే.. అతనికి క్యాష్ అయింది.. పుల్లయ్య టోకరా మామూలుగా లేదుగా..


అంత వడ్డీ వస్తుంది.. ఇంత వడ్డీ వస్తుంది.. ఇక మీరు లక్షాధికారులే.. నన్ను నమ్మండి.. అంటూ అందరినీ నమ్మించాడు.. కోట్లకు కోట్లు వసూలు చేశాడు.. కట్ చేస్తే, ఆ డబ్బులన్నీ జమ చేసుకుని పరారయ్యాడు.. చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో ఓ వ్యక్తి అందరినీ నట్టేట ముంచిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం నుంచి బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చి అడ్డా కూలీగా పని చేసిన వ్యక్తి కొద్ది కాలంలోనే కోటీశ్వరుడు అయ్యాడు. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచి పరారయ్యాడు. ఏకంగా 120 కోట్లకు పైగానే సొమ్ము చెల్లించకుండా ఉడాయించడంతో.. బాధితులు లబోదిబోమంటున్నారు.

అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 25 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. మొదట్లో అడ్డా కూలీగా పని చేసిన పుల్లయ్య కొద్దిగా కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. చిన్న చిన్న చిట్టీలతో ప్రారంభించి కోట్లలో చిట్టీలు కట్టించుకునే స్థాయికి ఎదిగాడు. మొదట్లో చిన్న గుడిసెలో ఉన్న పుల్లయ్య హైదరాబాద్ నగరంలో ఐదంతస్తులకు భవంతిలో ఉండే స్థాయికి ఎదిగాడు. ఎస్సార్ నగర్‌లోని బీకేగూడలో కుటుంబంతో నివాసం ఉండేవాడు. పుల్లయ్య దగ్గర చిట్టీలు కట్టిన వారిలో ఎక్కువగా పేదలే ఉన్నారు. పిల్లల చదువుల కోసం, అమ్మయిల పెళ్లిళ్ల కోసం కుదవపెట్టుకున్న సొమ్ముతో చిట్టీల వ్యాపారి అలియాస్ తాపీ మేస్త్రీ ఉడాయించడంతో దిక్కు తోచని స్థితిలో బాధితులు అతని ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.

పుల్లయ్య.. చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఆశచూపి తన వద్దే ఉంచుకునేవాడు. మళ్లీ అదే సభ్యులతో చిట్టీలు వేయించేవాడు. దీంతో పాటు తెలిసిన వారి వద్ద వడ్డీకి కోట్లలో అప్పుగా తీసుకున్నాడు. సుమారు రెండు వేల మంది పుల్లయ్య వద్ద చిట్టీలు వేసినట్లు తెలుస్తుంది. చిట్టీలు కట్టిన వారికి ఈనెల 23 నుంచి 26వ తేదీలోపు డబ్బులు ఇస్తానని చెప్పిన పుల్లయ్య.. 21నే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు.

దీంతో బాధితులు చేసేదేం లేక సిసిఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుల్లయ్య… తమ లాంటి కూలీలను నమ్మించి నిండా ముంచాడని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *