కొబ్బరి నీళ్లు మంచివే కానీ ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా..? కొబ్బరి నీటిని సాధారణంగా ఆరోగ్యకరమైన డ్రింక్ గా భావిస్తారు. కానీ చాలా ఎక్కువగా తాగితే కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. వేసవిలో వేడి తగ్గించడానికి కొబ్బరి నీటికి డిమాండ్ పెరుగుతుంది. కొందరు ఆరోగ్యకరమని భావించి ఎక్కువగా ఒకేసారి రెండు లేదా మూడు గ్లాసులు తాగుతున్నారు. అయితే ఎంత వరకు తాగాలి అనేది తెలుసుకోవడం అవసరం.
కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల పనితీరుకు సహాయం చేస్తుంది. కానీ ఎక్కువ తాగితే రక్తంలో అధిక పొటాషియం స్థాయిలు (హైపర్కలేమియా) ఏర్పడతాయి. దీని వల్ల హృదయ స్పందన తారుమారవడం, కండరాల బలహీనత, వికారం, వాంతులు, కొన్ని సందర్భాల్లో గుండె ఆగిపోవడం జరుగుతుంది.
మూత్రపిండాలు శరీరంలో పొటాషియం స్థాయిలను సమతుల్యం చేసే కీలక భూమిక పోషిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, శరీరం నుంచి అనవసరమైన పొటాషియాన్ని ఫిల్టర్ చేయలేవు. దీనివల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి, రక్తపోటు సమస్యలు లేదా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా రక్తపోటు లేదా గుండె జబ్బుల కోసం మందులు తీసుకునే వారు పొటాషియం స్థాయిలను నియంత్రించుకునేలా జాగ్రత్తగా ఉండాలి.
కొబ్బరి నీటిని సహజ ఎలక్ట్రోలైట్ పానీయంగా భావిస్తారు. కానీ ఎక్కువగా తాగితే సోడియం, మెగ్నీషియం, కాల్షియం సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల కండరాల తిమ్మిరి, తల తిరగడం, అలసట, వికారం వస్తాయి.
200 మి.లీ కొబ్బరి నీటిలో 5-6 గ్రాముల చక్కెర ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది.
కొంతమందికి కొబ్బరి నీరు ఎక్కువగా తాగినప్పుడు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రావొచ్చు. ఇది ఇందులో అధికంగా ఉండే మెగ్నీషియం కారణంగా జరుగుతుంది. మెగ్నీషియం సహజంగా జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే కొబ్బరి నీరు కొంతమందికి విరేచనాలాంటి ప్రభావాన్ని కలిగించవచ్చు.
కొబ్బరి నీళ్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మితంగా తాగడం మంచిదే. కానీ మూత్రపిండాలు, మధుమేహం లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)