పగటిపూట రైలు ప్రయాణాలతో పోలిస్తే రాత్రిపూట రైలు ప్రయాణాలు ఎందుకు వేగంగా అనిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? తరచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి ఇది తెలిసే ఉంటుంది. కొన్ని సార్లు మనం అనుకున్నదానికన్నా చాలా ఆలస్యంగా ఈ రైళ్లు మన గమ్యస్థానాలకు తీసుకువెళ్తుంటాయి. అర్జెంటుగా వెళ్లాల్సిన టైంలో ఈ ఆలస్యం చాలా చిరాకు తెప్పిస్తుంటుంది. అదే మీరెప్పుడైనా రాత్రి ప్రయాణాలు చేశారా.. రాత్రి పూట రైళ్లు రెట్టింపు వేగంతో జెట్ స్పీడ్ లో కదులుతుంటాయి. నిమిషానికో స్టేషన్ వచ్చిందా అనేంతలా వీటి వేగం ఉంటుంది. అయితే ఈ వ్యత్యాసం వెనక పలు ఆసక్తికర విషయాలున్నాయి. అవేంటో చూద్దాం..
స్టేషన్లలో తక్కువ స్టాపులు స్థానిక ప్రయాణికులకు వసతి కల్పించడానికి పగటిపూట రైళ్లు చాలా స్టేషన్లలో ఆగుతాయి. అయితే, రాత్రి సమయంలో, చాలా చిన్న స్టేషన్లలో వీటిని ఆపరు. దీని వల్ల వాటి సగటు వేగం పెరుగుతుంది.
పగటి పూట రైల్వే ట్రాక్ పై ఎక్కువ జన సంచారం ఉండటం, అక్కడకడ్కడ ట్రాక్ పనులు చేపడుతుండటం, మనుషులు పట్టాలను దాటుతుండటం, అలాగే జంతువులు సైతం ట్రాక్‌పై నుంచి వెళ్తుండటం జరుగుతుంటుంది. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీటన్నింటని దృష్టిలో ఉంచుకుని పగటి సమయంలో రైలు తన స్పీడ్‌కంటే కాస్త నెమ్మదిగానే ఉంటుంది.
ఇక రాత్రుల్లో జన సంచారం ఉండదు. ట్రాక్‌పై ఎలాంటి జంతువులు గానీ, మనుషులు గాని వెళ్లేందుకు ఆస్కారం ఉండదు. పైగా పగటి పూటకంటే రాత్రి సమయాల్లో సిగ్నల్స్ బాగా కనబడతాయి. సిగ్నల్స్ కూడా రాత్రిపూట రైలు ముందుకు వెళ్లాలా ఆగిపోవాలా అనేది క్లియర్ కనిపిస్తుంటుంది.
రాత్రి పూట దూరం నుండి ట్రాక్ బాగా కనబడుతుంది. ఈ కారణం వల్లనే లోకోపైలట్లు వేగంగా వెళ్తుంటారు. ఒకవేళ రైలు ఆగాల్సి వచ్చినప్పుడు దూరం నుండి సిగ్నల్ చూసి ఆపుతారు. అలాగే చాలా మంది పగటి సమయంలో ట్రాక్ వద్ద సబ్‌వే ఉన్నా కూడా వాటిపై నుంచి వెళ్లకుండా ట్రాక్‌పై వెళ్తుంటారు. రాత్రుల్లో ఎవ్వరు కూడా ట్రాక్‌పై నుంచి వెళ్లరు. కాబట్టి వేగం పెంచినా పెద్దగా నష్టం ఉండదని భావిస్తారు.
అంతేకాదు రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే పగటిపూటనే చేస్తుంటారు. అందుకే పగటి సమయంలో కాస్త జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అదే రాత్రి సమయాల్లో పనులు జరగవు. అందుకే రైళ్లు పగటి కంటే రాత్రుల్లో వేగంగా వెళ్లడానికి అసలు కారణం ఇది.