ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పలహ్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారత దేశాన్ని కలిచి వేసింది. పచ్చని ప్రకృతిని ఆస్వాధించేందుకు వెళ్లిన సుమారు 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మతాన్ని అడిగి మరీ ఒక్కొక్కరి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడి తరువాత జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో LOC నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు జరుతపున్న కాల్పులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. మరోవైపు ఉగ్రదాడిపై దర్యాప్తును ముమ్మరం చేసిన నిఘా వర్గాలు కీలక విషయాలను రాబడుతున్నారు. తాజాగా ఉగ్రవాదులు మరోసారి దాడులకు పాల్పడవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈసారి భద్రతా దళాలు, పర్యాటకులు, సామాన్య ప్రజల టార్గెట్‌గా కాకుండా.. జైళ్లలో ఉన్న ఉగ్రవాదులు టార్గెట్‌గా దాడులు జరగవచ్చని హెచ్చరికలు జారీ చేశారు.
శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు వంటి జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జైళ్ల భద్రతను మరింత పటిష్ఠం చేసింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF). ప్రస్తుతం జమ్ముకశ్మీర్ జైళ్లలో హై-ప్రొఫైల్ ఉగ్రవాదులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు (OGWs), ఉగ్ర సంస్థల స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు ఉగ్రవాదులకు లాజిస్టికల్ సహాయం, ఆశ్రయం, రవాణాకి సాయం చేస్తూ వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. వారి ద్వారా తమ సమాచారం బయటకు వస్తుందన్న కోణంలో ఉగ్రవాదులు జైళ్లను టార్గెట్ చేసినట్లు తెలిస్తోంది.
ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఉగ్రవాద సహచరులు నిసార్, ముష్తాక్‌లను ప్రశ్నించింది. గతంలో పూంచ్-రజౌరీలో ఆర్మీ వాహనంపై దాడి కేసులో వీరు అరెస్టయ్యారు. లష్కర్ ఏ తోయిబా సంస్థతో ఉన్న సంబంధాలు. స్థానిక ఉగ్రవాదులు ఎవరెవరు పాక్ ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు. ఎక్కడ తలదాచుకుంటున్నారన్న కోణంలో NIA విచారణ జరిపింది. గతంలో జమ్మూ శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రదాడులు, ఆ దాడులకు సహకరించిన స్థానిక ఉగ్రవాదులు ఓవర్ గ్రౌండ్ వర్కర్లను ప్రశ్నిస్తూ ఉగ్రవేటను ముమ్మరం చేసిన తరుణంలో నిఘా వర్గాలు జైళ్ల భద్రతపై భద్రతా బలగాలను అప్రమత్తం చేసాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో.. CISF డైరెక్టర్ జనరల్ శ్రీనగర్‌లో భద్రతా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, జైళ్ల భద్రతపై చర్చించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి