
రిషికేశ్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ మెడిసిన్ రంగంలో చరిత్రాత్మక ప్రయోగం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కనిష్ట ఆక్రమణ శవపరీక్ష (మినిమల్లీ ఇన్వాసివ్ ఆటోప్సీ) పద్ధతిని అభివృద్ధి చేసి అమలు చేసింది. ఈ ఆధునిక టెక్నిక్ నేర దర్యాప్తు, విచారణలను మరింత ఖచ్చితమైనవిగా చేయడమే కాకుండా, శవపరీక్ష ప్రక్రియను మానవీయంగా, గౌరవప్రదంగా మార్చనుంది. సాంప్రదాయ పద్ధతుల్లో శరీరాన్ని ఎక్కువగా కోయడం జరిగేది కానీ, ఈ కొత్త పద్ధతిలో ఎండోస్కోప్ సాయంతో పరీక్షలు నిర్వహిస్తారు.
ఎయిమ్స్ రిషికేశ్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ బినయ్ కుమార్ బస్తియా ఈ పద్ధతి గురించి వివరిస్తూ, “ఈ టెక్నిక్‌లో మృతదేహంపై మూడు చోట్ల సుమారు రెండు సెంటీమీటర్ల చిన్న రంధ్రాలు చేసి, అంతర్గత అవయవాలను పరిశీలిస్తాం. ఇప్పటివరకు శవపరీక్షల్లో శరీరాన్ని ఎక్కువగా కోసేవారు, ఆ రిపోర్టులను కాగితంపై అందించేవారు. కానీ ఈ కొత్త పద్ధతి శాస్త్రీయంగా అధునాతనమైనది మరింత గౌరవప్రదం” అని తెలిపారు.
డాక్టర్ బస్తియా మాట్లాడుతూ, ఈ టెక్నిక్ ఏప్రిల్ 14న ప్రారంభమైందని, అధిక రిజల్యూషన్ లాపరోస్కోపిక్ కెమెరాల సాయంతో అంతర్గత గాయాలు, హానిని ఖచ్చితంగా గుర్తించవచ్చని వెల్లడించారు. లైంగిక వేధింపుల వంటి సున్నితమైన కేసుల్లో ఈ పద్ధతి గౌరవప్రదంగా, వివరణాత్మక పరిశీలనను అందించి, కీలక సాక్ష్యాల సేకరణకు తోడ్పడుతుందన్నారు.
విషం లేదా మత్తుపదార్థాల వినియోగం సంబంధిత కేసుల్లో, ఎండోస్కోపిక్ సాధనాలతో నోటి, ముక్కు లోపలి భాగాలను గాయం లేకుండా పరీక్షిస్తామని ఆయన వివరించారు. ఈ ప్రక్రియ మొత్తం రికార్డ్ చేస్తారు. దీనివల్ల న్యాయపరమైన దర్యాప్తుకు పారదర్శక డాక్యుమెంటేషన్, వైద్య విద్యకు ఉపయోగపడే సమాచారం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ ఆవిష్కరణ ఫోరెన్సిక్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని నిపుణులు భావిస్తున్నారు.