ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక్కరు తప్పా ప్రయాణికులంతా మరణించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఎయిర్ ఇండియా విమానం ఎప్పకూలింది. ఈ ప్రమాదంలో 260 మది మరణించారు. వీరిలో విమానంలోని ప్రయాణికులతో పాటు అది కూలిన ప్రదేశంలోని మనుషులు కూడా మరణించారు. మరికొందరు గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒక తల్లి 8 నెలల చిన్నారి కూడా ఉన్నారు. ఐదు నెలల తర్వాత ఆ తల్లీకొడుకు ఆస్పత్రిలో కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు.
జూన్ 12న అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మనీషా కచ్చాడియా అనే మహిళ తన ఎనిమిది నెలల కుమారుడు ధ్యాన్ష్‌ను మంటల నుండి రక్షించింది. చుట్టూ మంటలు, దట్టమైన పొగ ఉన్నప్పటికీ, ఆమె తన పసికందును రక్షించుకుంది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన అతి పిన్న వయస్కుడిగా మారాడు.
మంటల్లో తల్లీ కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారిని రక్షించే క్రమంలో తల్లి ఓ కవచంలా మారి కాపాడుకుంది. బిజె మెడికల్ కాలేజీలో యూరాలజీలో సూపర్-స్పెషాలిటీ ఎంసిహెచ్ విద్యార్థి మనీషా కపిల్ కచ్చాడియాల కుమారుడు ధ్యాన్ష్. జూన్ 12న విమానం హాస్టల్‌పైకి కూలిపోయినప్పుడు కపిల్ ఆసుపత్రిలో విధుల్లో ఉన్నాడు. విమానం కూలిపోయినప్పుడు మనీషా కూడా గాయపడిందని కానీ కొడుకును కాపాడుకునే క్రమంలో తన ప్రాణాలను కూడా లెక్కచేయలేదని కపిల్ తెలిపారు.
“ఒక క్షణం బ్లాక్‌అవుట్ అయింది మరియు మా ఇల్లు వేడితో నిండిపోయింది” అని మనీషా జాతీయ మీడియాకు తెలిపారు. ఆ భయంకరమైన సమయంలో, ఆమె తన కొడుకును పట్టుకుని పరిగెత్తింది. ఆ మంటల్లో నుంచి తము బయటకు రాలేమని అనుకున్న క్షణం అది. కానీ బిడ్డ కోసం బయటకు రావలసి వచ్చింది. మేము ఇద్దరూ మాటల్లో చెప్పలేని బాధను అనుభవించాము” అని మనీషా తెలిపారు. మనీషా ముఖం మరియు చేతులకు 25% కాలిన గాయాలు అయ్యాయి. ధ్యాన్ష్ ముఖం, రెండు చేతులు, ఛాతీ మరియు ఉదరం అంతటా 36% కాలిన గాయాలయ్యాయి.
ఇద్దరినీ KD ఆసుపత్రికి తరలించారు, అక్కడ ధ్యాన్ష్‌ను వెంటనే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)లో చేర్చారు. ఆ శిశువుకు శ్వాస తీసుకోవడానికి వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. ఆ పిల్లవాడి వయస్సు కారణంగా కోలుకోవడం వైద్యపరంగా సంక్లిష్టంగా ఉందని వైద్యులు తెలిపారు. పిల్లాడి చికిత్సలో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి, అతని గాయాలను నయం చేయడానికి చర్మ మార్పిడి అవసరమైనప్పుడు, అతని తల్లి తన చర్మాన్ని అందించింది. మనీషా తన చర్మాన్ని తన కొడుకుకు దానం చేసి, అక్షరాలా మళ్ళీ అతనికి కవచంగా మారింది.