సూపర్ సిక్స్‌లో భాగంగా ఒక కీలకమైన పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ప్రయాణ ఖర్చును తగ్గిస్తూ, ఆర్థిక భారం తక్కువ చేయాలన్న లక్ష్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్ని ప్రారంభించనుంది. దీనికి ‘స్త్రీ శక్తి’ అనే పేరు పెట్టింది. ఇప్పటికే ఆ పేరుతో టికెట్ల రూపకల్పన, సాఫ్ట్‌వేర్ మార్పులు, సిబ్బందికి శిక్షణ వంటి ఏర్పాట్లన్నీ వేగంగా సాగుతున్నాయి.
“స్త్రీ శక్తి” టికెట్లపై ప్రత్యేక ముద్రణ
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే నమూనా టికెట్లపై “స్త్రీ శక్తి” అని ముద్రించారు. ప్రయాణం ఉచితంగా లభిస్తుందని తెలియజేస్తూ “జీరో ఫేర్ టికెట్” అనే పేరుతో టికెట్లు జారీ చేస్తారు. వాటిపై చార్జీలు, ప్రభుత్వ రాయితీ వివరాలు కూడా స్పష్టంగా ముద్రించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ విధానం వల్ల ప్రయాణ సమయంలో మహిళలకు ఏ మాత్రం అనుమానాలు లేకుండా స్పష్టత కలుగుతుంది.
సిబ్బందికి శిక్షణ, సాఫ్ట్‌వేర్ లో మార్పులు
ఈ పథకం అమలులోకి వచ్చే నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, డిపో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇవాళ్టి నుంచే జిల్లాలోని అన్ని డిపోలలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ టికెట్లు వేగంగా, సులభంగా జారీ అయ్యేలా టికెట్ మిషన్లు (TIMS), యూటీఎస్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు ఇప్పటికే పూర్తి చేశారు. మహిళలు బస్సుల్లో ఎక్కగానే తక్షణమే టికెట్ అందేలా వ్యవస్థను మేధాసారంగా రూపొందిస్తున్నారు.
ఆర్థిక భారం తగ్గించే చొరవ
“స్త్రీ శక్తి” పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, రాబోయే రోజుల్లో ఉద్యోగాలకు, వైద్య సేవలకు వెళ్తున్న లక్షలాది మహిళలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు, స్వేచ్ఛాయుతంగా ప్రయాణించేందుకు దోహదం చేస్తుందనేది అధికార వర్గాల విశ్లేషణ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి