ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు వద్దన్నారు. దీంతో పెళ్లి చేసుకొని జీవితాంతం ఒక్కటిగా ఉండాలనుకున్న దూరంగా వెళ్లిపోయి బతకాలని ప్రేమ జంట భావించింది. ఈ మేరకు పక్కా ప్లాన్ వేసుకుని.. కారులో పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రొంపిచర్లలో జరిగింది. ప్రేమికులను కేవీ పల్లి మండలం మహల్ రాజుపల్లికి చెందిన వంశీ, నందినిగా పోలీసులు గుర్తించారు. పెద్దలు అడ్డు చెప్పడంతోనే పారిపోయే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు.
తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని.. భద్రతా కల్పించాలని ప్రేమజంట పోలీసులను కోరింది. వారు పెళ్లి చేసుకునేందుకే పారిపోతున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు వచ్చాక వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. యువతి, యువకుడు మేజర్లు అని.. ఇష్టపడ్డవారిని వీడతీయొద్దని నచ్చజెప్పారు. తల్లిదండ్రుల సమక్షంలోనే ప్రేమజంటకు పెళ్లి జరిపించారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో వారిని పంపించారు. ఆ జంటకు తల్లిదండ్రులు ఏమైనా హానీ తలపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కల్లూరు సీఐ సూర్యనారాయణ హెచ్చరించారు. దీంతో పెద్దలకు భయపడి పారిపోయే ప్రయత్నం చేసిన పెళ్లి జంట ఎట్టకేలకు పోలీసుల కంటపడి ఒకటయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..