Andhra Pradesh: మోగిన ఎన్నికల నగారా.. అభ్యర్థుల విషయంలో ఇరు పార్టీల కసరత్తు..! ఎక్కడో తెలుసా?

Andhra Pradesh: మోగిన ఎన్నికల నగారా.. అభ్యర్థుల విషయంలో ఇరు పార్టీల కసరత్తు..! ఎక్కడో తెలుసా?


Andhra Pradesh: విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగింది. ఈనెల 28న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ తో జిల్లాలోని రాజకీయ పార్టీల్లో హడావుడి కూడా మొదలైంది. ఏ పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోనుంది? ఏ పార్టీకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయి? ఏ ఏ పార్టీలకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎవరు మరోసారి ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోబోతున్నారు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చే జరుగుతుంది.

విజయనగరం జిల్లాలో 2021 లో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇందుకూరి రఘురాజు. కొన్నాళ్లు పార్టీలో కష్టపడి పని చేసిన రఘురాజుకు ఆ తర్వాత రోజుల్లో అప్పటి స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో విభేదాలు మొదలయ్యాయి. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రఘురాజు భార్య ఇందుకూరి సుధారాణి వైసిపి నుంచి టిడిపిలో జాయిన్ అయ్యారు. అనంతరం ఇందుకూరి సుధారాణి టిడిపిలో యాక్టివ్ గా పని చేశారు. దీంతో రఘురాజు వైసిపికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని యోచనకి వచ్చిన వైసిపి.. ఎన్నికల వేళ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటు వేయాలని మండలి విప్ పాలవలస విక్రాంత్ మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేశారు.

విప్ విక్రాంత్ ఫిర్యాదుతో పలుమార్లు రఘురాజు వివరణ తీసుకున్న మండలి చైర్మన్ ఎమ్మెల్సీ రఘురాజు పై అనర్హత వేటు వేశారు. అలా జూన్ 3 నుంచి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. అనర్హత వేటు జరిగి ఐదు నెలలు కావడంతో రాజ్యాంగబద్ధంగా ఆరు నెలల లోపు తిరిగి ఎమ్మెల్సీ ని అపాయింట్ చేయాల్సిన నిబంధన ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకి షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ విడుదలతో అధికార కూటమి నాయకులు, విపక్ష వైసిపి నాయకుల్లో హడావుడి మొదలైంది. వాస్తవానికి వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన రఘురాజు ఎమ్మెల్సీ అనర్హత వేటుతో మరోసారి తమ పార్టీనే ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలని వైసిపి దృఢంగా ఆలోచిస్తుంది.

అయితే, అధికారంలో ఉన్న తామే ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది కూటమి. వాస్తవానికి జిల్లాలో 753 మంది ఓటర్లు ఉండగా వారిలో 548 మంది వైసీపీ ఓటర్లు, ఉండగా కేవలం 156 మంది టిడిపి ఓటర్లు, 13 మంది జనసేన, 13 మంది స్వతంత్ర ఓటర్లు ఉన్నారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. అయితే కూటమి అధికారంలో ఉండటంతో కూటమి అభ్యర్థులు కూడా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డే అవకాశం కనిపిస్తుంది.

ఎన్నికలే జరిగితే ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఆయా పార్టీల పాజిటివ్ ఏంటి? వారికున్న నెగిటివ్ ఏంటి? అనే చర్చ జోరుగా సాగుతుంది. స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలతో ఇప్పటికే వైసీపీ నుంచి విపక్ష ప్రతిపక్ష నేత బొత్స, జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను రంగంలోకి దిగారు. మరోవైపు అధికార కూటమి ప్రభుత్వం ఓట్లు తక్కువగా ఉన్న తాము ఎన్నికల బరిలో దిగాలా? దిగితే గెలుస్తామా? లేక ఓటమి పాలైతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయా? అనే అనేక కోణాల్లో విశ్లేషిస్తుంది.

ఇదిలా ఉండగా తనకు ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ రాజకీయ కోణంలో అనర్హుడిగా ప్రకటించారని, న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. రఘురాజు పిటిషన్ పై ఈ నెల ఆరవ తేదీన ఫైనల్ విచారణ జరగనుంది. తప్పు చేయని తనపై అన్యాయంగా అనర్హత వేటు వేశారని, ఫైనల్ జడ్జిమెంట్ లో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావంతో ఉన్నారు రఘురాజు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *