Andhra Pradesh: 24 గంటల్లోనే చర్యలు.. ఇక మురికి పోస్టులు పెడితే దంచుడే.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Andhra Pradesh: 24 గంటల్లోనే చర్యలు.. ఇక మురికి పోస్టులు పెడితే దంచుడే.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్


సోషల్ మీడియాలో మురికి పోస్టులు పెడితే ఊరుకునేది లేదు.. చర్యలు తప్పవు.. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు మొదలవుతున్నాయి. ఇప్పటికే 1500కు పైగా సోషల్ మీడియా అకౌంట్స్‌ను వివాదాస్పదమైనవిగా గుర్తించిన పోలీసులు.. 100 మందికి పైగా ఖాతాదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేవలం నోటీసులిచ్చి వదిలేస్తారని భ్రమపడొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు.. మాజీ సీఎం జగన్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ.. విశాఖలో నిరసనకు దిగారు వైసీపీ నేతలు. కేవలం టీడీపీ-జనసేన నేతలపై పెట్టిన పోస్టుల్నే చూడ్డం తగదని, జగన్‌పై సోషల్‌ మీడియాలో జరిగిన అసత్య ప్రచారం సంగతేంటని రివర్స్‌ గేర్ వేస్తోంది వైసీపీ. వైసీపీ నేతలపై జరిగిన ట్రోలింగ్ చూశారా అంటూ ఆధారాలతో సహా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, తీవ్రవాదుల్లా హింసిస్తున్నారని ఆరోపించారు.

ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏకంగా డీజీపీ నుంచే వార్నింగ్ వచ్చేసింది కనుక.. యాక్షన్ కూడా అదే రేంజ్‌లో మొదలైంది. రాష్ట్రస్థాయి ప్రముఖనేతల పర్సనల్ అసిస్టెంట్లకు సైతం నోటీసులు వెళ్లాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని హోం మంత్రి అనిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. హైకోర్టులో వరుస కేసులు రిజిస్టర్ కావడంతో.. ముఖ్యమంత్రి సైతం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని రివ్యూ చేస్తున్నారు.

వైసీపీ నేతల కుటుంబాలపై పోస్టులు పెట్టినా వదిలిపెట్టం..

సోషల్‌మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వాళ్లకు మరోసారి సీఎం చంద్రబాబు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీలు రాజకీయ ముసుగులో ఉన్నారు.. వాళ్ల ముసుగులు తీస్తామన్నారు. లాలూచీ పడే అధికారులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా తప్పుడు ధోరణితో ఉంటే.. ఇప్పటికైనా మానుకోండి.. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటామంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఫేక్ అడ్రస్‌లతో పోస్టులు పెట్టే వాళ్లను వదిలిపెట్టమని.. వైసీపీ నేతల కుటుంబాలపై పోస్టులు పెట్టినా వదిలిపెట్టమంటూ వార్నింగ్ ఇచ్చారు.

పవన్ కల్యాణ్ తో డీజీపీ భేటీ..

ఇదిలాఉంటే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో సమావేశమైన డీజీపీ పలు కీలక విషయాలపై చర్చించారు. ఇటీవల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి ఘటనలు, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు గురించి చర్చించినట్లు తెలుస్తోంది.. అయితే.. మొత్తం సోషల్ మీడియా పోస్టులపై ఇక చర్యలేనంటూ ఏపీ ప్రభుత్వం చేతలతో చెప్పకనే చెప్పింది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *