
మనుషులు కూడా అప్పుడప్పుడు జంతువుల తెలివితేటలను కళ్లకు కట్టినట్లు చూస్తారు. అవి చేసే పనులకు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇక కొన్ని జంతువులు అయితే ఊహకందని విధంగా తెలివితేటలకు ప్రదర్శిస్తాయి. కొన్ని జంతువులు ప్రమాదాలను ముందే గుర్తిస్తాయి. పైగా జంతువుల్లోని కమ్యూనికేషన్ ను చూస్తే తెగ ముచ్చటేస్తుంది. అయితే ఇలాంటి తెలివిగల అరుదైన జంతువులు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చింపాంజీలు..
చింపాంజీలు, మానవులకు దగ్గరి బంధువులని చెప్పొచ్చు. చింపాంజీలు తెలివిగా ఉండటంలో ఏమంత ఆశ్చర్యం లేదు. చింపాంజీలు సంక్లిష్టమైన సమస్యలకు సైతం పరిష్కారాలు కనుక్కుని తమ మనుగడను సాగించగలవు. కీటకాలను వేటాడే క్రమంలో అవి కర్రల వంటి సాధనాలను తెలివిగా ఉపయోగిస్తుంటాయి.
బోనోబోస్..
వన్యప్రాణుల్లో హిప్పీలు అని పిలిచే బోనోబోలు కూడా కొంచెం చింపాంజీల పోలికలే కలిగి ఉంటాయి. ఇవి మేథస్సు విషయంలో మహా గొప్పవి. సామాజికంగా మెలిగే తెలివితేటలు వీటి సొంతం.
డాల్ఫిన్లు..
ఈ జలచర జీవులు వేటాడేటప్పుడు రక్షణ కోసం స్పాంజ్ ల వంటి సాధనాలను ఉపయోగిస్తాయి. మనుషుల లాగే వారి వ్యూహాలను అమలు చేస్తాయి. వీటికి కూడా నవ్వడం తెలుసు. మనుషులతో కలిసిపోవడం డాల్ఫిన్లకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే కొన్ని రకాల వినోదశాలల్లో వీటిని ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచుతుంటారు.
ఆక్టోపస్ లు..
ఆ మధ్యకాలంలో ఆక్టోపస్ లు ఫుడ్ బాల్ , క్రికెట్ మ్యాచ్ ల వంటి ఆటల విషయంలో జోస్యం చెప్తున్నాయనే వార్తలు వినే ఉంటారు. ఇవి మానవుల్లాగే సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉంటాయి. తరచుగా తమను బంధించిన స్థానాల నుంచి తప్పించుకుంటూ ఉంటాయి. అందుకే వీటిని గ్రేట్ ఎస్కేపర్స్ గా పిలుస్తారు.
ఒరాంగుటాన్లు..
ఒరాంగుటాన్లు మనుషులతో చాలా దగ్గరి సంబంధాలను కలిగి ఉంటాయి. ఇవి అద్భుతైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగిస్తుంటాయి.
ఆఫ్రికన్ గ్రే చిలుకలు..
ఈ ఆఫ్రికన్ చిలుకలు పెంపుడు పక్షుల్లో బాగా ఫేమస్. ఇవి మనుషుల మాటలను అనుసరించే తెలివితేటలు కలిగినవి. వాటి మేథస్సుతో చూపరులను ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆకారం, రంగులను ఇవి తేలికగా గుర్తించగలవు. తార్కిక బుద్ధికి ఇవి పెట్టింది పేరుగా గుర్తింపు పొందాయి.
పందులు..
పందులు వీడియో గేమ్ లు ఆడగలవని మీకు తెలుసా.. వీటి తెలివితేటలు గొప్పవని చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ సరిపోతుందేమో..
ఏనుగులు..
ఏనుగులు అద్భుతమైన మెమరీ పవర్ ను కలిగి ఉంటాయి. అంతేకాదు నిత్యం వలస వెళ్లే ఈ జీవులు తాము వెళ్లిన ప్రాంతాలను అవసరమైతే తిరిగి వెనక్కి వెళ్లే దారులను సైతం గుర్తుంచుకుంటాయి. తమ తొండాలను అవసరానికి మేర ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో వీటికి బాగా తెలుసు.
కార్విడ్స్ (కాకులు, రావెన్స్)..
కాకుల వంటి జాతికి చెందిన కార్విడ్స్ తెలివైన పక్షులుగా పేరుగాంచాయి మానవ ముఖాలను ఇవి సులభంగా గుర్తించగలవు. ఏడు లేదా అంతకంటే ఎక్కువ వయసుగల పిల్లల తెలివితేటలకు సమానమైన తెలివి వీటిలో ఉంటుంది.
బోర్డర్ కోలీస్.. కుక్కలు..
శునకాలు మనుషులకు ప్రియమైన నేస్తాలు. అనుకున్నదానికంటే తెలివైనవి. వీటిలో బోర్డర్ కోలీలు మరీ తెలివైనవిగా గుర్తింపు పొందాయి. ఇవి వీటి నైపుణ్యాలతోనే కాదు.. వినయ విధేయతలకు కూడా పెట్టింది పేరు.