అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు గవర్నర్ నజీర్ ప్రసంగించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ.. స్వర్ణాంధ్ర విజన్ ఆవిష్కరణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ నజీర్ తెలిపారు.. కాగా.. తొలిరోజుఅసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదంటూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. సభ నుంచి వాకౌట్ చేశారు.
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామని కూటమి ప్రభుత్వం తమకు విపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు ఆ పార్టీ నేత వైఎస్ జగన్. అసెంబ్లీలో అపోజిషన్‌లో వైసీపీ తప్ప వేరే పార్టీ లేదు కాబట్టి విపక్ష హోదా తమ హక్కు అన్నారు జగన్. ప్రతిపక్షహోదా ఇస్తే హక్కుగా సభలో ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందనే భయంతో ప్రభుత్వం తమకు విపక్ష హోదా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ లేకుండా అసెంబ్లీ నడపాలని చూస్తున్నారన్నారన్నారు జగన్. తాను ఇంకా 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానన్న జగన్.. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై గళం విప్పుతామన్నారు. 2028 ఫిబ్రవరిలో జరిగే జమిలి ఎన్నికల్లో అధికార కూటమిని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత..
వైసీపీకి సభలో ప్రతిపక్ష హోదా కల్పించాలని డిమాండ్ చేశారు మాజీమంత్రి బొత్స సత్యనారాయణ. సభలో సమస్యలపై ప్రశ్నించాలంటే ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని చెప్పారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీలకు కూడా విపక్ష హోదా ఇచ్చారన్నారు. కానీ ఏపీలో ప్రతిపక్షాల గొంతునొక్కాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తుందన్నారు.
పవన్ కల్యాణ్ కౌంటర్..
విపక్ష హోదాపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదన్నారు. ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు . జనసేన కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి విపక్ష హోదా దక్కేది అన్నారు పవన్ కల్యాణ్. ఈ టర్మ్ ముగిసేవరకు వైసీపీకి ప్రతిపక్షహోదా రాదని కరాఖండిగా చెప్పేశారు ఉప ముఖ్యమంత్రి. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రావాలని హితవు పలికారు పవన్ కల్యాణ్. ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా స్పీకర్ సమయం కేటాయిస్తారన్నారు.
వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ లీడర్స్. శాసన సభ సభ్యత్వం రద్దవుతుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి హాజరయ్యారన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రజలు 11 మందిని గెలిపించి పంపిస్తే 11 నిమిషాలు కూడా సభలో ఉండకుండా వాకౌట్ చేశారన్నారు. మరోవైపు ప్రజా సమస్యలపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలన్నారు టీడీపీ నేతలు. సభ నుంచి పారిపోయి ప్రెస్ మీట్లు పెడితే లాభం లేదన్నారు టీడీపీ నేతలు.
ప్రతీసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు టీడీపీ నేతలు. వచ్చే జమిలి ఎన్నికల్లో వైసీపీకి ఈ 11 సీట్లు కూడా రావంటూ సెటైర్లు వేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..