గుంటూరు జిల్లా చౌడవరంలోని చేతన పాఠశాలలో కోటేశ్వరరావు అనే వ్యక్తి సంగీత మాష్టారుగా పనిచేస్తున్నారు. కోటేశ్వరరావు మాష్టారుది బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడు స్వగ్రామం.. గొర్రెపాడు సమీపంలోనే బొగ్గుల కొండ ఉంది. బొగ్గులకొండపై దిగంబర స్వామి ఉండేవాడు. ఈ స్వామిని దర్శించుకోవడానికి అనేకమంది వెళ్తుండేవారు. ఆ ఊరు సంగీత మాష్టారి సొంతూరు కావడంతో ఒకసారి ఆయన స్నేహితులతో కలిసి బొగ్గుల కొండ వెళ్లారు. స్నేహితులతో కొండపైన ఉన్న సమయంలోనే కోటేశ్వరావు స్నేహితుడు సరదాగా ఒక రాయిని మరొక రాయితో కొట్టాడు. అయితే ఆ శబ్దం విన్న కోటేశ్వరావు మాష్టారు అందులో సరిగమపదనిసల్లోని ఒక అక్షర స్వరంలా ఉండటాన్ని గమనించాడు. వెంటనే మరోసారి ప్రయత్నం చేయగా అదే శబ్దం వచ్చింది. స్వతహాగా సంగీత మాష్టారు కావడంతో ఆయన తాను భావించిన అంశాన్ని రుజువు చేసుకునేందుకు రాళ్లపై పరిశోధనలు చేసే వారిని పిలిపించారు. వారు వాటిని పరిశీలించిన తర్వాత ఆ ఒక్క రాయే కాదు ఇతర రాళ్లలోనూ మిగిలిన స్వరాలు పలుకుతున్నట్లు గుర్తించారు. సాధారణంగా సప్త స్వరాలు పలికే రాళ్లుంటాయి. అయితే ఇక్కడ లభ్యమైన రాళ్లు ద్వాదశ స్వరాలను పలుకుతున్నట్లు పరిశోధకులు చెప్పారు.
దీంతో సంగీత మాష్టారు కోటేశ్వరరావు వాటిని భద్రంగా సేకరించి తాను పనిచేస్తున్న పాఠశాలకు తీసుకొచ్చారు. అక్కడ వాటిని ప్రదర్శనకు ఉచ్చారు. రాళ్లు సంగీత స్వరాలను పలుకుతున్నాయని కోటేశ్వరావు మాస్టారు చెప్పారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పలువురు ఆశ్చర్యపోవడమే కాకుండా వాటిని చూసేందుకు మక్కువ చూపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి