అమరావతి, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తికాగా.. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు త్వరలోనే మెయిన్స్ పరీక్షలు సైతం జరగనున్నాయి. ఈ మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) తాజాగా మెయిన్స్ తేదీని వెల్లడించింది. దీని ప్రకారం జూన్ 1, 2025వ తేదీన తుది రాతపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన 95,208 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాయనున్నారు. విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. పరీక్ష రోజున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష ఉంటుందని పేర్కొంది.
కాగా 2022లో అప్పటి జగన్ సర్కార్ 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరిలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 4.59 లక్షల మంది హాజరు కాగా.. వారిలో 95,208 మంది అభ్యర్థులు తుది రాతపరీక్షకు అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఒకే పేపర్‌గా ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలకు తమ వెబ్సైట్ సందర్శించాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి ఓ ప్రకటనలో తెలిపింది.
ఏపీ పాలిసెట్ 2025 హాల్‌టికెట్లు విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2025) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ఏప్రిల్ 30న పాలిసెట్ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని డిప్లొమా సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీ పాలిసెట్ 2025 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.