ఆర్‌బీఐ రెపోరేటు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో అన్ని బ్యాంకులు దాన్ని అమలు చేస్తున్నాయి. దీనివల్ల ఇప్పటికే రుణాలు తీసుకున్నవారితో పాటు కొత్తగా తీసుకునేవారికీ వడ్డీరేటు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, హౌసింగ్ రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలోని వాణిజ్య బ్యాంకులకు ఆర్ బీఐ రుణాలను మంజూరు చేస్తుంది. వాటికి విధించే వడ్డీరేటునే రెపోరేటు అంటారు. ఈ రేటు పెరిగితే బ్యాంకులు తమ వడ్డీరేటును పెంచుతాయి. రెపోరేటు తగ్గితే వడ్డీరేటు కూడా తగ్గుతుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంకు రెపోరేటును తగ్గించింది. మార్కెట్ లో నగదు ప్రవాహాన్ని నియంత్రణ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
వ్యక్తి గత రుణాలు
- రెపోరేటు 6.25 శాతానికి వచ్చిన తర్వాత వివిధ బ్యాంకులు వ్యక్తిగత రుణాలకు వడ్డీరేటును తగ్గించాయి.
- పంజాబ్ నేషనల్ బ్యాంకులో సవరించిన వడ్డీరేట్లు ఫిబ్రవరి 12 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ బ్యాంకు రూ.20 లక్షల వరకూ వ్యక్తిగత రుణం అందజేస్తోంది. వడ్డీరేటు 11.25 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఖాతాదారులు భౌతికంగా బ్యాంకును సందర్శించకుండానే, పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేకుండానే రుణం పొందవచ్చు.
- బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో ప్రస్తుతం 10 శాతం వడ్డీరేటుకు వ్యక్తిగత రుణాలను అందజేస్తున్నారు.
- యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఫిబ్రవరి 11 నుంచి కొత్త వడ్డీరేట్లు అమలవుతున్నాయి. కేవలం 11.50 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తున్నారు.
- సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 12.75 శాతం, హచ్ఎస్బీసీ బ్యాంకులో 10.15 నుంచి 16 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 10.85 నుంచి 21 శాతం వసూలు చేస్తున్నారు.
హౌసింగ్ రుణాలు
- హౌసింగ్ రుణాల వడ్డీరేటు కూడా తగ్గుదలను చవి చూసింది. రిజర్వ్ బ్యాంకు ఆదేశాలపై ఇప్పటికే కడుతున్న ఈఎంఐల మొత్తం తగ్గుతుంది. లేకపోతే ఈ మొత్తాన్ని అలాగే ఉంచి కాలవ్యవధిని తగ్గిస్తారు. కొత్తగా తీసుకునే వారికి సవరించిన వడ్డీరేట్లపై రుణాలు మంజూరు చేస్తారు.
- బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర తన హౌసింగ్ రుణాల వడ్డీరేటును 8.10 శాతానికి తగ్గించింది. అలాగే వీటితో పాటు కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేసింది.
- స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా 8.25 శాతం వడ్డీరేటుతో హౌసింగ్ రుణాలను మంజూరు చేస్తుంది.
- పీఎన్ బీ లో 8.15 శాతం వడ్డీకి హౌసింగ్ రుణాలను మంజూరు చేస్తున్నారు.
- కెనరా బ్యాంకులో 8.15 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు.
- కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐడీఎఫ్ సీ హోమ్ లోన్, యాక్సిస్ బ్యాంకులు సుమారు 8.75 శాతం విధిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..