Betting Apps: గంటకు వందల కోట్ల వ్యాపారం.. పదుల సంఖ్యలో ఆత్మహత్యలు.. బెట్టింగ్ యాప్‌లను అపేదెలా..?

Betting Apps: గంటకు వందల కోట్ల వ్యాపారం.. పదుల సంఖ్యలో ఆత్మహత్యలు.. బెట్టింగ్ యాప్‌లను అపేదెలా..?


బెట్టింగ్ యాప్‌ల పేరుతో గంటకు వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది..! రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి..! పట్నమే కాదు ప్రతి పల్లెకూ విస్తరించిందీ బెట్టింగ్‌ మార్కెట్. కోట్లాది మంది సంపాదనలో 50 శాతానికి పైగా బెట్టింగ్‌పైనే పెడుతున్నారు. మరలాంటి బెట్టింగ్‌ మాఫియాను మట్టుబెట్టేదెలా..? యాప్‌లను అపెదెట్లా..? నిర్వహకులపై ఫోకస్‌ సరే.. అసలు ట్రాక్‌ చేసెదెలా..? బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లపై కేసులు పెట్టారు. చాలా మందిని విచారణకూ పిలిచారు. పలువురిని అరెస్ట్‌ కూడా చేశారు. పరారీలో ఉన్నవాళ్ల కోసం వేట సాగిస్తూనే ఉన్నారు. ఇదంతా సరే.. అసలు బెట్టింగ్‌ అన్నదే లేకుండా చేయడం సాధ్యమేనా..? నిర్వాహకులను పట్టుకోవడం అయ్యే పనేనా..? ఇప్పుడిదే పెద్ద సవాల్‌గా మారింది.

ఆన్‌లైన్ బెట్టింగ్ కంపెనీలది ప్రపంచమంతా పాకేసిన ఒక మాఫియా.. మొదట అన్ని ఆన్‌లైన్ కంపెనీల్లాగే ఒక డొమైన్‌ను కొంటారు. వెబ్‌సైట్‌ను, యాప్‌ను డెవలప్‌ చేయించడానికి బాగానే పెట్టుబడి పెడతారు. జైపూర్, ఢిల్లీ, నొయిడా నుంచే కాదు అవసరమైతే విదేశాల్లోని మాంచి డెవలపర్స్‌ను పట్టుకుని.. గేమ్‌ డిజైనింగ్‌ నుంచి పేమెంట్ గేట్‌వే దాకా అన్ని వసతుల్ని యాప్‌లో చక్కగా తయారుచేయిస్తారు. ఆ తర్వాత.. మార్కెటింగ్‌ వ్యవస్థతో జనాల్లోకి తీసుకెళ్తారు. అందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయర్లకు అడిగిన దానికంటే ఎక్కువే చెల్లించి యాప్స్‌ను ప్రమోట్ చేస్తారు. అలాగే యూజర్లతో టచ్‌లో ఉండేందుకు 24 గంటలూ పనిచేసే కాల్‌సెంటర్లు కూడా నడుపుతారు. ఇలా.. అత్యంత గోప్యంగా సాగే చీకటి సామ్రాజ్యంలా ఉంటుంది బెట్టింగ్ యాప్స్ బాగోతం.

ఇక ఇప్పటికే చాలా దేశాల్లో బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం ఉంది. కొన్ని దేశాలు మాత్రం బెట్టింగ్ యాప్స్‌కి స్వర్గధామాలుగా చెలామణీ అవుతున్నాయి. ఇందులో చైనా కూడా ఒకటి. ఇండియాలో నేరుగా బెట్టింగ్ యాప్స్ నడిపించకపోయినా, ఆర్థిక మద్దతు, టెక్నాలజీ సపోర్ట్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా జూద వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తోంది డ్రాగన్ కంట్రీ. వ్యాపారాలమీద, పెట్టుబడుల మీద విపరీతంగా పన్ను మినహాయింపులిచ్చే సైరస్, మాల్టా లాంటి దేశాలు గ్యాంబ్లింగ్ కంపెనీలకు కేరాఫ్ లాంటివి. అందుకే.. అధికపక్షం బెట్టింగ్ యాప్స్ అక్కడినుంచే ఆపరేట్ అవుతున్నాయన్న రిపోర్ట్‌లూ ఉన్నాయి.

మరి ఆ రేంజ్‌లో విస్తరించి ఉన్న ఈ బెట్టింగ్‌ మాఫియాను కట్టడి చేయడం పోలీసులకు బిగ్‌ టాస్క్‌ అనే చెప్పాలి. నిర్వహకులను పట్టుకోవడం… అలాగే ఊసరవెల్లిలా రంగులు మార్చే యాప్‌లను నియంత్రించేందుకు టెక్కీలను సైతం రంగంలోకి దించుతున్నారు. బెట్టింగ్‌ యాప్‌లపై ప్రజల్లోనూ అవగాహణ పెంచేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక ఐపీఎల్‌తో ఇప్పుడు పోలీసులకు బిగ్‌ టాస్క్‌ వచ్చి పడింది. బెట్టింగ్‌ రాయుళ్లు బెస్ట్‌ టైమ్‌గా భావించే ఈ ఐపీఎల్‌లో కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగే అవకాశాలున్నాయి. గెలుపోటములపైనే కాదు.. బంతిబంతికీ బెట్టింగులు నడుస్తుంటాయి. దీంతో నిఘా పెంచారు పోలీసులు. బెట్టింగు బాబుల బెండు తీయడమే కాదు.. నిర్వహకుల అంతుచూసేందుకు సిద్ధమయ్యారు. మరి చూడాలి ఈ బెట్టింగ్‌ మాఫియాను ఎలా కట్టడి చేస్తారో..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *