CM Revanth Reddy: ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


తెలంగాణ, ఏపీ మధ్య పోటీ అవసరం లేదని  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  తెలుగు రాష్ట్రాలు రెండూ కలిసి అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. దీనికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నా కలిసి కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని అన్నారు.  హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ముగింపు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రారంభమైందని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగని గుర్తుచేశారు. జాతీయ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. తెలుగువారైన నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, జీ వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారని కొనియాడారు. చంద్రబాబు, వైఎస్సార్ కొంత మేర ప్రభావం చూపినా.. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిందన్నారు.

రాజకీయం, సినీ,వాణిజ్య రంగాల్లో రాణించినా మన మాతృ భాషను మరిచిపోవద్దని రేవంత్ రెడ్డి సూచించారు. పరభాషా జ్ఞానం సంపాదించాలి కానీ మన భాషను గౌరవించాలన్నారు. తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. తాను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు తనను కలిసినట్లు తెలిపారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని.. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.

ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *