హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి అదేశించారు.
జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. భారీగా నీరు చేరే లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం అన్నారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు భారీ కురుస్తున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని.. తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
మరోవైపు జిల్లాల్లో, గ్రామాల్లో వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లు సూచించారు. రైతులు ఎవరూ చెట్ల కింద ఉండవద్దని తెలిపారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్థంభాలు కూలి చెట్లపై పడే అవకాశం ఉందని.. రైతులు చూడకుండా వెళ్తే ప్రమాదాల బారీన పడే అవకాశం ఉందన్నారు. రైతులు పొలాల నుంచి ఇంటికి వచ్చేప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా స్థంభాలు విరిగిపడి ఉంటే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.