Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..

Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..


గత అసెంబ్లీ ఎన్నికల(2020) సమయంలో జనవరి 14న నోటిఫికేషన్ జారీ అవ్వగా, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా కాస్త అటూఇటుగా తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఈ ఏడాది జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షల తేదీలతో ఎన్నికల తేదీలకు ఇబ్బంది కలుగకుండా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

ముక్కోణపు పోరులో లాభపడేదెవ్వరు?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గత రెండు పర్యాయాలు పోటీ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్యనే పోటీ నెలకొనగా.. ఈసారి కాంగ్రెస్ తన పూర్వవైభవం చాటుకోవాలని చూస్తోంది. ఆప్ కంటే ముందు సుదీర్ఘకాలం పాటు దేశ రాజధానిలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత డిపాజిట్లు సైతం దక్కించుకోలేని స్థితికి చేరుకుంది. ఆ పార్టీ ఓటు బ్యాంకు దాదాపుగా ఆప్ హస్తగతం చేసుకుంది. దాంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 10 శాతానికి పడిపోయింది. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి శత్రువు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలసికట్టుగా పోటీ చేసినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు వేర్వేరు తీర్పులు ఇస్తున్నారు. జాతీయస్థాయిలో బీజేపీ నేతృత్వంలోని సుస్థిర ప్రభుత్వానికి మొగ్గుచూపుతూ వచ్చారు. అందుకే ఈ రెండు పార్టీలు కలిసినా సరే.. 7 సీట్లలో ఒక్కటి కూడా కైవసం చేసుకోలేకపోయింది. కానీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించి అమలు చేస్తున్న ఉచితాలు, ప్రజాకర్షక పథకాలు వరుసగా ఆయన్ను గెలిపిస్తూ వచ్చాయి. రాజధానిలో ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థలను మెరుగుపరిచి మార్కులు సాధించడం కూడా కేజ్రీవాల్‌కు కలిసొచ్చిన అంశాలయ్యాయి.

దళిత, మైనారిటీ వర్గాల్లో కోల్పోయిన పట్టును మళ్లీ సాధిస్తూ తమ ఓటుబ్యాంకును మెరుగుపరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, ఈ సారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే పొరుగునే ఉన్న హర్యానాలో గెలుపు వాకిట తడబడి ఓడిన కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆప్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన 53.57 శాతం ఓట్లు సాధించి 70 అసెంబ్లీ స్థానాల్లో 62 గెలుపొందగా, 38.51 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 8 సీట్లలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 4.26 శాతానికే పరిమితమైంది.

పదేళ్ల పాలనపై సహజంగా ఏర్పడే వ్యతిరేకతకు తోడు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, శీష్ మహల్‌గా పేరొందిన విలాస నివాస భవనం సహా 2020 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలు చేయలేకపోవడం వంటివి కేజ్రీవాల్‌కు ప్రతికూలాంశాలుగా మారాయి. ఈ ప్రతికూలతలు కేజ్రీవాల్ గతంలో సాధించిన 53 శాతం ఓట్లలో కోత విధిస్తాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే అవి ఎటువైపు మళ్లుతాయి అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఒకవేళ నేరుగా బీజేపీకి బదిలీ అయితే ఆ పార్టీ విశేషంగా లాభపడుతుంది. అలాకాకుండా కాంగ్రెస్ వైపు మళ్లినా సరే.. పరోక్షంగా బీజేపీకే వరంగా మారుతుంది. తాజా లోక్‌సభ ఎన్నికల తర్వాత ముస్లిం మైనారిటీలు, దళిత ఓట్లలో మళ్లీ కొంతమేర పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఈ వర్గాలను కేజ్రీవాల్‌కు దూరం చేసినా సరే.. కమలదళానికే ఉపయోగం ఎక్కువ. కాంగ్రెస్ పెంచుకునే ఓట్లశాతం ఆ పార్టీని గెలిపించకపోయినా.. దశాబ్దకాలం తర్వాత ఖాతా తెరిచేందుకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచి, బీజేపీకి పరోక్ష ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.

మరోవైపు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పురుడుపోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాజకీయ పార్టీలకు భిన్నమేమీ కాదని, అనేక రకాల అవినీతి, అక్రమాలకు తెరలేపిందని కమలదళం ప్రజాకోర్టులో బురదజల్లింది. ఇది తనపై సాగుతున్న కక్షసాధింపు రాజకీయమని, ప్రజాకోర్టులోనే తీర్పు అడుగుతానని సీఎం పదవిని వదులుకుని ఎన్నికల ప్రచారం చేపట్టిన కేజ్రీవాల్, కేసులు, అరెస్టు, జైలుపాలవడాన్ని సానుభూతి పవనాలుగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సాధించిన ఓట్లశాతాన్ని సమీప ప్రత్యర్థి బీజేపీతో పోల్చుకుంటే 15 శాతం తేడా ఉంది. ఇందులో ప్రతికూలతల కారణంగా కొంత మేర ఓట్లు తగ్గినా.. ఈ భారీ వ్యత్యాసాన్ని పూడ్చలేవని, సీట్లు కొన్ని తగ్గినా విజయం తమదేనన్న ధీమాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *