Donald Trump: వారిని రిలీజ్‌ చేయండి.. లేదంటే మీకు చావే! హమాస్‌ నాయకులకు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌!

Donald Trump: వారిని రిలీజ్‌ చేయండి.. లేదంటే మీకు చావే! హమాస్‌ నాయకులకు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌!


“ఇదే మీకు చివరి అవకాశం.. నా మాట వినకపోతే నరకం చూపిస్తాను.. గాజాను మరింత నాశనం చేస్తాను” అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హమాస్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. హమాస్‌ చెరలో ఉన్న మిగిలిన బందీలను తక్షణం విడుదల చేయాలని లేకపోతే తీవ్ర ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ట్రంప్‌ ట్రూత్‌ సోషల్ వేదికగా పోస్టు చేశారు. హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని, మరణించిన వారి మృతదేహాలను తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తగిన ఫలితాన్ని అనుభవిస్తారని హెచ్చరించారు. అందుకు ఇజ్రాయెల్‌కు కావాల్సిన అన్నింటినీ పంపుతానని తెలిపారు.

తాను చెప్పినట్లు చేయకపోతే హమాస్‌కు చెందిన ఒక్క వ్యక్తి కూడా సురక్షితంగా ఉండరన్నారు. హమాస్‌ చెరలో బందీలుగా ఉండి ఇటీవల విడుదలైన వారిని తాను కలిశానని, గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తోందని, హమాస్‌ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. ట్రంప్‌ ఇప్పటికే అనేకసార్లు హమాస్‌కు హెచ్చరికలు చేశారు. బందీలను విడుదల చేయకుంటే హమాస్‌ అంతుచూస్తానంటూ పలుమార్లు బెదిరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో గాజాలోని పరిస్థితులపై చర్చించారు. అనంతరం గాజాను స్వాధీనం చేసుకొని పునర్‌నిర్మిస్తామని ప్రకటించారు.

ట్రంప్ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పాలస్తీనియన్లు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడాలని సూచించారు. ఈ ప్రతిపాదనలను సౌదీ, జోర్దాన్‌తో సహా మిత్రదేశాలన్నీ ఖండించాయి. ఇక, ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య ఇటీవల తొలిదశ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కాస్త మార్చి 1, 2025తో ముగిసింది. దీంతో ఈ ఒప్పందాన్ని పొడిగించాలని అమెరికా ప్రతిపాదించింది. అందులో భాగంగా హమాస్‌ తన చెరలో బందీలుగా ఉన్నవారిలో సగం మందిని విడుదల చేయాల్సి ఉంటుందని టెల్‌అవీవ్‌ పేర్కొంది. దీనికి ఇజ్రాయెల్‌ అంగీకరించగా.. హమాస్‌ మాత్రం నిరాకరించింది. ఈ క్రమంలోనే గాజాకు అందే మానవతా సాయాన్ని ఇజ్రాయెల్‌ అడ్డుకుంది. ఈ చర్యలను పలు దేశాలు ఖండించాయి.

మరన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *