Fish Venkat Passes Away: నటుడు ఫిష్ వెంకట్ (54) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలూ డ్యామేజ్ కావడంతో డయాలసిస్ కోసం కొన్ని రోజుల క్రితం బోడుప్పల్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అయితే.. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు చెప్పినట్లు ఆయన కుమార్తె ఇటీవల తెలిపారు. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని వేడుకున్న కొద్దిరోజులకే ఫిష్ వెంకట్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఇక.. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్ కాగా.. ముషీరాబాద్ మార్కెట్‌లో చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముషీరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన.. నటుడు శ్రీహరి ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. డైరెక్టర్ వీవీ వినాయక్ ఆయన్ను నటుడిగా పరిచయం చేశారు. ఫిష్ వెంకట్ వందకు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్ని, అత్తారింటికి దారేది, డీజే టిల్లు లాంటి పలు హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం:
ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గతంలో సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యల కారణంగానే సరైన చికిత్స తీసుకోలేక ఫిష్ వెంకట్ మరణించారని తెలుస్తుంది. ఫిష్ వెంకట్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు పేర్కొంటున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలిసిన అభిమానులు తోటి నటీనటులు ఈయన మృతిపై స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.