Free Bus Journey for Women: గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్‌! ఎప్పట్నుంచంటే

Free Bus Journey for Women: గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్‌! ఎప్పట్నుంచంటే


అమరావతి, డిసెంబర్‌ 31: కూటమి సర్కార్ ఏపీ వాసులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఫిక్స్‌ చేసింది. కొత్త సంవత్సరంలో వచ్చే ఉగాది పండగ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం (డిసెంబర్‌ 30) తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో పరిశీలన త్వరితగతిన పూర్తి చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని కోరారు. ఇప్పటికే మహిళల ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు సాధ్యాసాధ్యాలపై పలు మార్లు చర్చలు జరిపిన సీఎం చంద్రబాబు అధికారుల నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం తీసుకున్నారు. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి, ఆ సంస్థ ఎండీ, డీజీపీ ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే తదితర అధికారులతో సోమవారం సచివాలయంలో జరిపిన సమీక్షలో ఈ మేరకు చర్చించారు.

తొలుత సంక్రాంతి నుంచే ఉచిత ప్రయాణ పథకాన్ని అమలుచేయాలని అనుకున్నట్లు సీఎం చంద్రబాబు అడుగగా.. జీరో టికెటింగ్‌ విధానం, ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పడుతుందనీ, 15 రోజుల్లో వీటన్నింటినీ సిద్ధం చేయడం కష్టమని తెలిపారు. చంద్రబాబు స్పందిస్తూ ఈ పథకం అమలు చేస్తున్న కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో పర్యటించి, అక్కడి అమలు విధానం అధ్యయనం చేసి అనుమానాలు నివృత్తి చేసుకుని రావాలని అధికారులకు సూచించారు.ఈ చర్చ అనంతరం ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అలాగే ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించాలి, ఆ సమ్యలు ఏపీలో రాకుండా ఉండేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలను అనుసరించాలన్నదానిపై నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

దీనిలో భాగంగా జనవరి 3న కర్ణాటక, 6, 7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించి నివేదికను సమర్పించనున్నట్లు మంత్రి రాంప్రసాదరెడ్డి చంద్రబాబుకు తెలిపారు. మొత్తంగా ఈ నివేదిక తర్వాత ఉచిత ప్రయాణంపై రాష్ట్ర సర్కార్ అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల సంఖ్య తక్కువనే చెప్పాలి. ఎందుకంటే గతంలో వైసీపీ అమలు చేసిన పలు పథకాలకు కూటమి సర్కార్ మంగళం పాడేసింది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *