Health: అసలు ఫుడ్‌ అలర్జీ ఎందుకు వస్తుంది.? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..

Health: అసలు ఫుడ్‌ అలర్జీ ఎందుకు వస్తుంది.? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..


ఫుడ్‌ అలర్జీ సమస్య సర్వసాధారణం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఈ సమస్యే వచ్చే ఉంటుంది. ఏదైనా ఆహార పదార్థం తీసుకున్న తర్వాత శరీరంలో మార్పలు రావడన్నే ఫుడ్‌ అలర్జీగా చెబుతుంటారు. శరీరం సదరు ఆహారాన్ని అంగీకరించని సమయంలో ఇలాంటి సమస్య వస్తుంది. ఒక పరిశోధన ప్రకారం 10% కంటే ఎక్కువ మంది యువత ఈ అలర్జీకి గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఫుడ్‌ అలర్జీ తీవ్ర స్థాయికి చేరుకొని ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంతకీ ఫుడ్‌ ఎలర్జీ ఎందుకు వస్తుంది.? ఎలాంటి లక్షణాల ఆధారంగా ఫుడ్‌ అలర్జీని అంచనా వేయొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..

మన రోగనిరోధక వ్యవస్థ ఒక నిర్దిష్ట రకమైన ఆహారానికి అతిగా స్పందించినప్పుడు ఆహార అలెర్జీ సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఇమ్యునోగ్లోబులిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. వేర్వేరు ఇమ్యునోగ్లోబులిన్లు వేర్వేరు పనులు చేస్తుంటాయి. ఇవి శరీరానికి పడని ఆహార పదార్థాలను తీసుకున్న సమయంలో శరీరం ప్రతి స్పందిస్తుంది. ఈ కారణంగానే శరీరంలో అలర్జీ లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.

ఫుడ్‌ అలర్జీ లక్షణాలు..

ఏదైనా పడని ఆహారం తీసుకున్న వెంటనే దురద లేదా చర్మంపై దద్దుర్లు వస్తాయి. పెదవులు లేదా నాలుక వాపునకు గురైనా అది ఫుడ్‌ అలర్జీగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. గొంతులో దురద, గొంతు బొంగురుపోవడం, మింగడంలో ఇబ్బందిగా ఉండడం, గొంతులో వాపు వంటి లక్షణాలు కూడా ఫుడ్‌ అలర్జీవే. ఇక కొందరిలో శ్వాసలో గురక, ఛాతీ బిగుతు లేదా ఆకస్మికంగా దగ్గు రావడం వంటి శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఫుడ్‌ అలర్జీతో వస్తాయి. కొన్ని రకాల ఫుడ్స్‌ తీసుకున్న వెంటనే వాంతులు, కడుపు తిమ్మిర్లు లేదా వికారం వంటి లక్షణాలు కనిపించినా ఫుడ్‌ అలర్జీ జరిగినట్లే అర్థం చేసుకోవాలి.

వీరిలోనే అధికం..

ఇంతకు ముందు ఏదైనా అలర్జీ బారిన పడిన వారిలో పుడ్‌ అలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆస్తమా, సీజనల్‌ అలెర్జీలు, తామర వంటి సమస్యలతో బాధపడేవారిలో కూడా ఫుడ్‌ అలర్జీ వస్తుంది. పెద్దలతో పోల్చితే చిన్నారుల్లో ఫుడ్‌ అలెర్జీల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ శాతం ఫుడ్‌ అలర్జీ పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులతో పాటు వేరుశనగ, గుడ్లు, చేప, సోయా, గోధుమ వంటి వాటితో సంభవిస్తాయని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *