
హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి లేకుంటే నో ఎంట్రీ. ఇటు వైపు వెళ్ళాలా అయితే శిరస్త్రాణం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి చెప్పబడినవి. ఇవి పాటిస్తేనే లోపలికి ప్రవేశం లేదంటే అక్కడి నుండి అటే తిరుగు ప్రయాణమే. ఇదంతా రహదారిపై పోలీసుల ఆంక్షలు అనుకుంటున్నారా..? కాదు.. ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలంటే.. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి లేదంటే ఎంట్రీ నిషిద్ధం. ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సహజ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే చాలామంది చనిపోతున్నారు. ముఖ్యంగా మానవ తప్పిదాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు భద్రతపై ప్రభుత్వాలు అనేక అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇపుడు దేశ వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో వాహనదారులు తప్పనిసరిగా ప్రయాణ భద్రత నిబంధనలు పాటించడం తప్పనిసరి చేసింది.
ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తన కార్యాలయ ఉద్యోగులకు హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధన తప్పనిసరి చేశారు. కార్యాలయానికి వాహనాలపై వచ్చే ఉద్యోగులు తప్పకుండా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకుని రావాలనే నిబంధన పెట్టారు. సాధారణంగా భద్రతా నియమాల ప్రకారం ప్రజలు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. లేదంటే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజలను జాగృతం చేసే క్రమంలో అధికారులు తీసుకోవలసిన చర్యలపై సూర్యాపేట కలెక్టరేట్ లో కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. రోడ్డు భద్రతా నిబంధనలను సామాన్య ప్రజలతోపాటు అధికారులు కూడా పాటించేలా కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధన తప్పనిసరి చేశారు. కార్యాలయ ఉద్యోగులందరు విధిగా సూచించిన మేరకు రావాల్సి ఉంటుందని లేదంటే అనుమతి నిరాకరిస్తామని ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనల అమలుపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ..
నిబంధనలు పాటించని ఉద్యోగులను కలెక్టర్ హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటిస్తున్న అధికారులను చూసి కలెక్టరేట్ కు వచ్చే సామాన్య ప్రజలు సైతం ప్రభావితమై భద్రతా నియమాలు పాటిస్తారనేది ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి