సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది. మచ్చ బొల్లారం వీబీ సిటీ కాలనీలో నివాసం ఉంటున్న ఆశిష్ అనే వ్యక్తి బుజ్జి బుజ్జి కుక్క పిల్లలను కర్కశంగా హతమార్చాడు. ఏప్రిల్ 14 సోమవారం రోజున ఆశిష్ 3 వీధి కుక్కలపై దాడి చేసి అతి కిరాతకంగా అంతమొందించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో చిక్కాయి. తన పెట్ డాగ్ వద్దకు వీధి కుక్క పిల్లలు వస్తుండటంతో.. ఉన్మాదిలా మారిన ఆశీష్ ఓ బిల్డింగ్‌లోని సెల్లార్లో ఇటుక బిల్లలతో వాటిని కొట్టి హింసించి చంపాడు. దాడిలో తీవ్ర గాయాల పాలైన కుక్కపిల్లలు స్పాట్ లోనే మృతి చెందాయి.
ఈ ఘటనపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా ఆశిష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. వీధి కుక్కలపై కోపంతోనే వాటిని చంపినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడని తెలిపారు. తన వద్ద పెట్ ఉండి కూడా మూగజీవాలపై ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి