ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో టీమిండియా నాలుగో టెస్టును విజయవంతంగా డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 311 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, టీమ్ ఇండియా బలంగా పుంజుకుంది. రెండో టెస్ట్ గెలిచింది. అయితే గెలవాల్సిన లార్డ్స్‌ను ఓడిపోయింది. ఆ బాధ నుంచి బయటపడుతూ.. నాలుగో టెస్ట్‌లో అద్భుతంగా ఆడింది.
రెండో ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా ఐదో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసి.. సిరీస్ గెలవాలనే ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లింది. మ్యాచ్ గెలవకపోయినా.. ఈ డ్రా గెలుపుకంటే ఏ మాత్రం తక్కువ కాదు అంటున్నారు క్రికెట్ అభిమానులు. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, కెఎల్ రాహుల్ మధ్య 188 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లాండ్‌కు మూడో విజయాన్ని దూరం చేసింది.
ఆ తర్వాత రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని పూర్తిగా ముగించి టీమిండియాను ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. రవీంద్ర జడేజా ఈ సిరీస్ అంతటా బౌలింగ్ తో పెద్దగా విజయవంతం కాకపోయినా, తన బ్యాట్ తో పోరాట ప్రదర్శన కనబరిచాడు. లార్డ్స్ లో విజయం కోసం పోరాడిన జడేజా, ఇప్పుడు మాంచెస్టర్ లో జట్టును ఓటమి నుండి కాపాడటానికి సుందర్ తో జతకట్టాడు.
ఇక మరో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ టెస్టుల్లో తన మొట్టమొదటి సెంచరీ సాధించాడు. అది కూడా ఇంగ్లాండ్ లాంటి ఒక స్ట్రాంగ్ టీమ్‌పై వాళ్లు సొంత గడ్డపై ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
టెస్టుల్లో తన తొలి సెంచరీతో టీమిండియాకు విజయం అందించలేకపోయినా.. ఇంగ్లాండ్‌కు విజయాన్ని దూరం చేస్తూ.. టీమిండియాను ఓటమి నుంచి రక్షించాడు. అలాగే సిరీస్ సమం చేసే అవకాశం సజీవంగా ఉంచాడు. ఈ మ్యాచ్‌లో సుందర్ 206 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.