తెలంగాణలో మార్చి 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను సోమవారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఈరోజు IPE 2025 హాల్ టిక్కెట్లను జారీ చేశారు. హాల్ టిక్కెట్లను కాలేజీల లాగిన్‌లకు అప్‌లోడ్ చేశారు. విద్యార్థులు తమ సంబంధిత కళాశాలల నుండి హాల్ టిక్కెట్లను తీసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లలో ఏవైనా తేడాలు, తప్పులు ఉంటే వారు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్, బాధ్యులను సంప్రదించాలని తెలిపారు. విద్యార్థులకు త్వరలోనే నేరుగా హాల్ టికెట్లను సైతం పంపించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
మార్చి 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షల కోసం బోర్డు ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ కలిపి దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను పకడ్బంధీగా నిర్వహించిన ఇంటర్ బోర్డు .. అదే తరహాలో వార్షిక పరీక్షలను సజావుగా నిర్వహించాలని భావిస్తోంది. తొలిసారి ప్రాక్టికల్ పరీక్షలకు సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించి.. అదే కెమెరాల సాయంతో ఫైనల్ ఎగ్జామ్స్ కు వినియోగించుకోవాలని చూస్తోంది.
దాదాపు 3,500 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంట్రీ గేటు వద్ద, ఎగ్జామ్ ప్రశ్నా పత్రం ఓపెన్ చేసే ప్రిన్సిపాల్ రూంలో.. కాలేజి వెనక మైదానం కవర్ అయ్యేలా మూడు సీసీ కెమెరాలు.. ఒక్కో సెంటర్లో ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులూ, సందేహాలు ఉన్నా కాలేజీ ప్రిన్సిపాల్ లేదా ఇంటర్ బోర్డు అధికారులను సంప్రదించవచ్చని సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..