
మనం సంపాదించిన మొత్తాన్ని మంచి మార్గాల్లో పెంచుకోవడానికి పెట్టుబడులు ఒక తెలివైన ఎంపికగా చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. అయితే, సరైన స్ట్రాటజీని ఎంచుకోవడంలోనే ఉంది అసలు సమస్య. ప్రస్తుతం భారత దేశంలో ప్రజాదరణ పొందిన మూడు పెట్టుబడి మార్గాలున్నాయి. అవి.. బంగారం, ఈక్విటీలు(స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్), పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్). ఇందులో దేని ప్రయోజనాలు దానికే ప్రత్యేకం. రాబడితో పాటు నష్టాల రిస్క్ కూడా ఉంటుంది. ఇవన్నీ దాటుకుని మీరు మంచి ఎంపికను చేసుకోగలగాలి.
పీపీఎఫ్..
పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిండెంట్ ఫండ్. ఇది మీ ఇన్వెస్టిమెంట్ మొత్తానికి అధిక భద్రతను కల్పించే దీర్ఘకాలిక పెట్టుబడి. ప్రభుత్వం తరఫున దీనికి భద్రత కల్పించబడుతుంది. పెట్టుబడి పెట్టిన మొత్తం మీద ప్రయోజనకరమైన వడ్డీ రేటుతో పాటు మంచి రాబడి కూడా కలిగి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాను తెరవడానికి మీరు భారత దేశ పౌరుడై ఉండి ఇక్కడే నివసిస్తుండాలి. అర్హత కలిగిన వారు తమ పిల్లలపేరు మీద కూడా ఈ ఖాతాను తెరవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు ఏడాదికి 7.1 శాతంగా ఉంది. దీని కాల పరిమితి 15 ఏళ్లు. మరో 5 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. దీనిపై ఏటా చక్రవడ్డీ ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఈ వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఇది మార్చి 3`న చెల్లిస్తారు. ఇందులో ఏడాదికి రూ.500 నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది స్థిరమైన వడ్డీతో పాటు రిస్క్ లేని బెనిఫిట్స్ ను అందిస్తుంది. వీటికి సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు కూడా ఉంది. ఇక పీపీఎఫ్‌లో ఏటా రూ. 1.2 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యురిటీ నాటికి రూ.32,54,567 మొత్తం వస్తుంది. రిస్క్ ఇష్టపడని వారికి పీపీఎఫ్ అనుకూలంగా ఉంటుంది.
ఈక్విటీలు..
ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం అంటే ఒక కంపెనీ స్టాక్ ను కొనుగోలు చేయడం ద్వారా దానిపై పెట్టే పెట్టుబడి. ఈ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ లో మార్పు చెందుతుంటాయి. అయితే, ఇవి పెట్టుబడి అసలు విలువను పెంచుతుంటాయి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టిమెంట్ పెట్టగలిగి.. నష్టభయాన్ని భరించగలిగితే ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టొచ్చు. వీటి వల్ల లాభాలతో పాటు రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్ హెచ్చుతగ్గులు, ఆర్థిక మాంద్యం, కంపెనీ నిర్ధిష్ట కారకాల వంటి విషయాల వల్ల ప్రభావితమవుతుంటాయి. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారు మ్యూచువల్ ఫండ్స్, సిప్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అందులో కాస్త అవగాహన ఉన్న వారు వీటిని మేనేజ్ చేస్తుంటారు. అతడే డబ్బును సరైన కంపెనీని ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తాడు. షేర్లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ తక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ లో లాభాలు కోరుకుంటే వీటిలో పెట్టుబడి పెట్టొచ్చు. అయితే, మార్కెట్ హెచ్చుతగ్గులు వీటిని కూడా ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలి.
బంగారం..
స్టాక్ మార్కెట్ రిస్కును ఇష్టపడని వారు చాలా మంది సంప్రదాయ మార్గమైన బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు.
గోల్డ్ ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన పదేళ్లలో బంగారం ధరలు 237.5 శాతం పెరిగాయి. అంటే పదేళ్లలో బంగారం పై పెట్టుబడి పెట్టిన వారు భారీగానే లాభపడ్డారు. బంగారం స్పష్టమైన విలువ గల ఒక ఆస్తి. ఇతర ఆస్తుల మాదిరిగా అధిక తరుగుదల లేదా అస్థిరత ఉండదు. బంగారంలో పెట్టుబడి పెట్టడం వలన ఆర్థిక భద్రత ఉంటుంది. ఆర్థిక నష్టాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. అదే సమయంలో సులభంగా డబ్బును చేసుకోవడానికి (లిక్విడిటీ) వీలవుతుంది. ద్రవ్యోల్బణం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అయితే, ఇందులో కూడా బంగారం ధరలు పతనమయ్యే రిస్క్ ఉంటుందని గమనించాలి.