ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తన శక్తిమంతమైన ఆటతీరుతో మళ్లీ సంచలనం సృష్టిస్తోంది. వాంఖడే స్టేడియంలో జరిగిన 45వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పై ఘన విజయం సాధించి, వరుసగా ఐదవ విజయం నమోదు చేసింది. ఈ విజయంతో వారు పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి దూసుకెళ్లారు. ఈ విజయాల పరంపర మిగతా జట్లపై ఒత్తిడిని పెంచుతుందని మాజీ భారత స్పిన్నర్ పియూష్ చావ్లా అభిప్రాయపడ్డాడు. ఆయన తన వ్యాఖ్యల్లో ముంబై జట్టును పొగడ్తలతో ముంచెత్తుతూ, “ప్రతి జట్టు ముంబై ఇండియన్స్‌ను చూసి భయపడాలి,” అని తేల్చిచెప్పాడు.
జియో హాట్‌స్టార్‌లో మాట్లాడుతూ చావ్లా, ముంబై ఇండియన్స్ జట్టులో మొదటి నుండి పదకొండవ నంబర్ వరకు మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని అన్నారు. ముఖ్యంగా ర్యాన్ రికెల్టన్ హాఫ్ సెంచరీపై ప్రశంసలు కురిపిస్తూ, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ‘ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్’గా ఎలా ప్రభావం చూపించాడో వివరించాడు. అలాగే విల్ జాక్స్ రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌పై నిర్ణయాత్మక మలుపు తిప్పిన విధానాన్ని కూడా ప్రస్తావించాడు. “బుమ్రా వంటి ఆటగాడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి, ఆ తర్వాత జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తే, ఆ జట్టు మామూలు జట్టు కాదు,” అంటూ చావ్లా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఇప్పుడు సరైన సమయంలో టోర్నమెంట్‌లో తళుక్కుమంటోంది. చావ్లా ప్రకారం, ఈ జట్టు అన్నింటి కంటే ముందు గెలవడం ఎలా అనే విషయాన్ని తెలుసుకుంటోంది. అతని మాటల్లో, “హార్దిక్ చేస్తున్నది జట్టుకు కలిసొస్తోంది. ఆ ప్లేయింగ్ XIలో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ రోల్‌లో ఉన్నప్పుడు, మిగతా జట్లు వారిని చూసి భయపడాల్సిందే.” ఇది మాత్రమే కాదు, గత రెండు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ కూడా తన అనుభవంతో మంచి శురువు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆరు విజయాలు, నాలుగు ఓటములతో 10 జట్లలో మూడవ స్థానంలో ఉంది. ఇప్పుడు వారు మే 1న జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కొననున్నారు. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుండగా, ముంబై ఇంకొక విజయంతో తమ గెలుపు పరంపర కొనసాగించాలనుకుంటోంది. వారి ప్రస్తుత ఫామ్, ఆటగాళ్ల సానుకూల స్థితిగతులు చూస్తే, మిగతా జట్లకు ఇది నిజమైన పరీక్షగా మారనుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..