విజయ్ దేవరకొండ మరోసారి తన అభిమానుల పట్ల తన గాఢమైన ప్రేమను వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ఆదరణను తానెప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. “మీరు నాకు దేవుడిచ్చిన వరం” అంటూ ఈ సందర్భంగా విజయ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. గత కొంతకాలంగా తన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా… అభిమానులు మాత్రం ఎప్పటిలాగే అండగా నిలిచారని, ప్రతి సినిమా టైం లోనూ తన విజయం కోసం వారు ఎంతగానో కోరుకుంటున్నారనీ విజయ్ అభిమానం గల గర్వంగా చెప్పారు. ఇటీవల తిరుపతిలో విడుదలైన ట్రైలర్‌కి వచ్చిన స్పందన గురించి మాట్లాడుతూ– “ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది అభిమానులు ‘ఈసారి మన హిట్ కొడుతున్నాం’, ‘ఈసారి మన సినిమా టాప్ లో ఉంది’, ‘మనకే హిట్ గ్యారెంటీ’ అంటూ కామెంట్లు చేశారు. ఏ ఒక్కరు కూడా ‘నీకు హిట్ వస్తుంది’ అనలేదు. అందరూ ‘మనకే’ అనడం చూసి నా హృదయం ఉప్పొంగిపోయింది,” అని తెలిపారు ఈ ప్రేమే తనకు అసలైన బలం అని చెప్పిన విజయ్, “మీరు నన్ను మీ వాడిని చేసుకున్నారు… అందుకే ఇలాంటి మాటలు వింటున్నాను,” అని ఎమోషనల్ అవుతూ చెప్పారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మొత్తం తన సినిమా కంటే ఎక్కువగా అభిమానుల గురించే మాట్లాడారు ఆయన.
‘మరో రెండు రోజుల్లో జులై 31న మిమ్మల్ని థియేటర్లలో కలవబోతున్నాం. మనసులో కొంచెం భయం ఉంది, అదే సమయంలో ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉంది. ‘కింగ్‌డమ్’ అవుట్ పుట్ పట్ల టీమ్ అందరం సంతోషంగా ఉన్నాము. ఈరోజు నేను అభిమానుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మీరు నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. అదే ప్రేమ, అదే నమ్మకం నాపై చూపిస్తున్నారు. ఈ రోజు ఫ్యాన్ మీట్ లో దాదాపు రెండు వేల మందిని కలిశాను. అందులో ఎక్కువమంది నాతో చెప్పిన మాట ‘అన్నా ఈసారి మనం హిట్ కొడుతున్నాం’. నన్ను మీ వాడిని చేసేసుకున్నారు. నా విజయాన్ని చూడాలని మీరు కోరుకుంటున్నాను. సినిమా వల్లే మీకు నేను పరిచయం అయ్యాను. మీ కోసం ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాను. మీరందరూ నా నుంచి కోరుకుంటున్న హిట్ ‘కింగ్‌డమ్’తో రాబోతుంది. ఇది విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కాదు.. గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’. ఈ కథ ఆలోచన పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా పని మీదే ఉన్నాడు గౌతమ్. ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పటికీ వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈ వేడుకకి రాలేకపోయాడు. ఆ తర్వాత ఇది అనిరుధ్ రవిచందర్ ‘కింగ్‌డమ్’. పాటలు ఇప్పటికే విన్నాము. నేపథ్యం సంగీతం కూడా అదిరిపోతుంది. నా సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. అది ‘కింగ్‌డమ్’తో నెరవేరింది. తన సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇది ఎడిటర్ నవీన్ నూలి ‘కింగ్‌డమ్’. నాలో ఒక ఫైర్ ఉంటుంది. మా వాళ్లకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది. ఈసారి నాకు ఇంత ఫైర్ ఉన్న టీమ్ దొరికింది. అలాగే ఇది నాగవంశీ ‘కింగ్‌డమ్’. ఎంతో రిస్క్ చేసి ఈ సినిమా చేశారు. బెస్ట్ అవుట్ పుట్ రావడం కోసం.. ఎక్కడా రాజీ పడకుండా మేము ఏది అడిగితే అది ఇచ్చారు. భాగ్యశ్రీ బోర్సే కొత్తమ్మాయి. కానీ, సినిమా కోసం చాలా కష్టపడుతుంది. రాబోయే రోజుల్లో పెద్ద స్థాయికి వెళ్తుంది. నా సోదరులు సత్యదేవ్, వెంకటేష్ ఇద్దరూ చాలా మంచి నటులు. ఈ సినిమాలో అన్న పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ పాత్రలో సరైన నటుడు చేస్తేనే సినిమా పండుతుంది. అలాంటి పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని చాలా చర్చించిన తర్వాత.. సత్యదేవ్ ని ఎంపిక చేశాడు గౌతమ్. షూటింగ్ సమయంలో సత్యదేవ్ నిజంగానే నాకు సోదరుడిలా అనిపించాడు. సత్యదేవ్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. అలాగే వెంకటేష్ అద్భుతంగా నటించాడు. భవిష్యత్ లో బిగ్ స్టార్ కావాలని కోరుకుంటున్నాను. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, సినిమాటోగ్రాఫర్స్ జోమోన్, గిరీష్.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. రెండు రోజుల్లో ‘కింగ్‌డమ్’ మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని విజయ్ చెప్పుకొచ్చారు.