ఓవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా, సహాయక నటుడిగానూ ఆకట్టుకుంటున్నాడు నటుడు సత్యదేవ్. ఈ క్రమంలోనే కింగ్ డమ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడీ ట్యాలెంటెడ్ హీరో. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు శివ అనే పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ లలో విజయ్ తో పాటు సత్యదేవ్ కూడా హైలెట్ అయ్యాడు. దీంతో కింగ్ డమ్ సినిమాతో అతని పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. కాగా సోమవారం రాత్రి జరిగిన కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సత్యదేవ్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించాడు. అతను విజయ్ దేవరకొండ కాదని విజయ్ బంగారు కొండ అని కితాబిచ్చాడు. అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతోన్న విజయ్ ను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నాడు.
‘కింగ్డమ్ లో భాగమైనందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. విజయ్ ను నేను చాలా దగ్గర నుంచి చూశాను. చాలా అరుదైన వ్యక్తి. మంచి మనిషి, ఇతరుల గురించి కేర్ తీసుకుంటాడు. విజయ్ ఈ సినిమాతో ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సామాన్యుడిలా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘కింగ్డమ్’ను స్థాపించుకున్న విజయ్ అంటే నాకు అపార గౌరవం. విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దేవరకొండ కాదు బంగారుకొండ. అనిరుధ్ ఏది పట్టుకుంటే అది బంగారం. అనిరుధ్ సంగీతం అందించిన సినిమాలో భాగం కావడం గర్వంగా ఉంది. నాగవంశీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎవరైతే కొన్ని సినిమాలు చేయడానికి భయపడతారో.. అలాంటి సినిమాలు నాగవంశీ గారు చేసి హిట్లు కొట్టి, గట్స్ ఉన్న నిర్మాత అనిపించుకున్నారు. విజయ్ తో పాటు ఈ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను నాగవంశీ గారు తీసుకున్నారు. ప్రతి నటుడు గౌతమ్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనేది నా అభిప్రాయం. మనలో ఇంత నటన దాగుందా అని మనమే ఆశ్చర్యపోయేలా.. మన నుంచి నటనను రాబడతాడు. భవిష్యత్ లోనూ గౌతమ్ తో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ తో సహా అందరూ అద్భుతంగా నటించారు’ అని చెప్పుకొచ్చాడు సత్యదేవ్.
ఇక ఈ సినిమాకు హార్ట్ బీట్ అయిన అనిరుధ్ రవిచందర్ కూడా విజయ్ పై ప్రశంసలు కురిపించాడు. విజయ్ కారణంగానే తాను కూల్ గా వర్క్ చేశానని కితాబిచ్చాడు.