రాజకీయాల్లో సవాళ్లు ప్రతిసవాళ్లు కామన్. తెలంగాణలో ఇటీవలే సీఎం రేవంత్ బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసరగా.. కేటీఆర్ సిద్ధమని ప్రకటించారు. ఈ సవాళ్ల రాజకీయం ఏపీకి చేరింది. అయితే ఇది రాజకీయ సవాల్ కాదు. అభివృద్ధికి సంబంధించినది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విసిరిన ఛాలెంజ్‌ను మంత్రి నారా లోకేశ్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు విషయానికొస్తే.. ఏపీలో ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. శ్రీ సత్యాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్తచెరువు జడ్పీ స్కూల్లో ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. విద్యార్థులతో ముచ్చటించి.. వాళ్లు రెడీ చేసిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను తిలకించారు. అనంతరం విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో చంద్రబాబు, లోకేష్ మాటామంతి కలిపారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చిన సీఎం.. మార్కులు పెంచుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. స్కూళ్లలో విద్యతో పాటు ఆటలు, యోగా నేర్పిస్తున్నామన్నారు. స్కూళ్లలో రాజకీయాలకు తావులేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు అన్నీ స్కూళ్లలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్‌తో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. జగన్ హయాంలో విద్యార్థులకు నాణ్యత లేని యూనిఫామ్స్ ఇచ్చారని.. తాము అటువంటి తప్పు చేయలేదన్నారు. ప్రతి విజయం వెనక గురువు ఉంటారని.. మనకు బాధ్యత నేర్పేది అమ్మ కాబట్టి.. తల్లికి వందనం స్కీం పెట్టినట్లు తెలిపారు. ‘‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని సూచిస్తే.. ప్రధాని పిలుపుతో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. పవన్ సవాల్‌ను స్వీకరిస్తున్నా. విద్యాశాఖ ద్వారా కోటి మొక్కలు నాటుతాం’’ అని లోకేశ్ తెలిపారు.
టీచర్‌గా మారిన సీఎం
అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు టీచర్‌గా మారారు. సహజ వనరుల గురించి విద్యార్ధులకు పాఠాలు చెప్పారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే వనరుల సద్వినియోగం అవసరమని.. విద్యార్ధులు చదువుకునే పాఠ్యపుస్తకాలు కూడా ఇతరులు మరోసారి వినియోగించుకునేలా జాగ్రత్తగా వాడాలని సూచించారు. విద్యుత్, నీరు లాంటి వనరుల సద్వినియోగం కూడా సామాజిక బాధ్యత అంటూ వివరించారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల వైపు విద్యార్ధులు దృష్టి పెట్టాలని సూచించిన సీఎం.. అందరూ ఉద్యోగాలే కాదు రాజకీయాల్లోకి కూడా రావాలన్నారు. నారా లోకేష్ బాగా చదువుకుని ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని సీఎం సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..