మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలన్నీ హరిహర నామస్మరణతో హోరెత్తుతున్నాయి. ఉదయం నుంచే భక్తుల పవిత్ర స్నానాలు ఆచరించి.. మహాశివుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.. దీంతో అన్ని శైవక్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అయితే.. మహాశివరాత్రి పర్వదినం వచ్చిందంటే.. ఎవ్వరికైనా మొదట గుర్తుకు వచ్చేది ఈషా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమం.. అంతలా మహాశివరాత్రి వేడుకలను నిర్వహిస్తుంది ఈషా ఫౌండేషన్. సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు కనీవినీ ఎరుగనిరీతిలో జరుగుతాయి.. ప్రతి ఏడాదిలాగే ఈసారీ కూడా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది సద్గురు నేతృత్వంలోని ఈషా ఫౌండేషన్.. మహాశివరాత్రిని పురస్కరించుకుని తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న శివరాత్రి వేడుకలకు హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.. ఈ సందర్భంగా సద్గురుతోపాటు.. హోంమంత్రి అమిత్ షా పూజలు నిర్వహించారు.
దేశ విదేశీ ప్రముఖులతోపాటు వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఈషా ఫౌండేషన్ ప్రాంగణంలో కలర్‌ఫుల్‌గా జరిగే మహాశివరాత్రి వేడుకల్లో ప్రముఖులతోపాటు, సాధారణ ప్రజలు దీపాలను వెలిగించి శివుడి నామస్మరణతో పూజలు నిర్వహిస్తున్నారు..
ఈ వేడుకల్లో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు.. పాటలు.. శివారాధన భక్తులను మరో లోకంలోకి తీసుకెళ్లనుంది.. బుధవారం సాయంత్రం 6గంటల నుంచి.. గురువారం ఉదయం వరకు ఈ వేడుక జరగనుంది.