బీడ్, నవంబర్ 20: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం (నవంబర్ 20) జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తమ ఇష్టమైన అభ్యర్ధికి ఓటు వేసేందుకు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ ముగిసింది. అయితే ఇదిలా ఉండగా ఓ పోలింగ్ కేంద్రం విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలారు. షిండేను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
బీడ్ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచిన బాలాసాహెబ్ ఛత్రపతి షాహూ విద్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ఎన్నికల తీరును పర్యవేక్షిస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన అనుచరులు బీడ్‌లోని కాకు నానా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఛత్రపతి శంభాజీ నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి ఆయన మరణించినట్లు తెలిపారు. దీంతో బీడ్ సెగ్మెంట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో బీడ్ నియోజక వర్గంలో షిండే ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. అయితే ఎన్నికల టైంలో ఒక అభ్యర్థి మరణిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 52 ప్రకారం సంబంధిత సీటుపై ఓటింగ్‌ను వాయిదా వేసే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు 288 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. నవంబర్ 23 శనివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్ ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.