యోగ సూత్రాలు (yoga principles) ఒక చిన్న ఆధ్యాత్మిక మనోవైజ్ఞానిక గ్రంధం. దాన్లోని సూత్రాలు క్లుప్తంగా, చాలా గూఢంగా ఉంటాయి. వివరణ లేకుండా యోగసూత్రాలను అర్థం చేసుకోవటం చాలా కష్టం. అందుకనేనేమో యోగసూత్రాలపై ఆకాలం నుంచి నేటి దాకా ఎన్నో వ్యాఖ్యానాలు సైతం వెలువడ్డాయి.యోగ సూత్రాలులోని శ్లోకాల సంఖ్య 194. ఈ సూత్రాలు నాలుగు పాదాలుగా విభజింపడ్డాయి.మొదటి పాదం పేరు సమాధి పాదం,రెండోది సాధన పాదం,మూఢోది విభూతి పాదం,నాలుగో పాదం కైవల్య పాదం.
యోగ సాధనకు అవసరమైన తాత్విక ప్రతిపాదనలు,జీవనశైలి మనో విజ్ఞానం,సాధన పద్ధతులు సమాధి, సాధన,కైవల్యఅనే మూడు పాదాలలో వివరించ పడ్డాయి. మూడో పాదమైన విభూతి పాదం యోగ వల్ల లభించే అద్భుత శక్తుల్ని వర్ణిస్తుంది. ఈ భాగంలో ఆకాశయానం, సమస్త జీవరాసుల భాషాజ్ఞానం, పునర్జన్మజ్ఞానం, భవిష్యజ్ఞానం, అంతర్ధాన శక్తి పరకాయ ప్రవేశం… ఇలా ఎన్నో శక్తులు వర్ణింపపడ్డాయి.
పతంజలి నిర్దేశించిన ఆధ్యాత్మిక పధంలో ఎనిమిది అంగాలు ఉన్నాయి. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులు. మొదటి ఐదు యోగ యొక్క బహిరంగమైన అంశాలు. చివరివి మూడు, చిత్తానికి సంబంధించినవి. అంతరంగమైనవి.ఇప్పడు ఎనిమిది అంగాలు గురించి క్లుప్తంగ తెలుసుకుందాము.
- యమములు : సత్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము ఈ ఐదు యమములు. మనిషి తన జీవితాన్ని ఎలా నడుపుకోవాలో,బాహ్యప్రపంచంతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో ఇవి చెబుతాయి .ఉదా :ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో, నిజాయితీ, సమస్త జీవరాసుల పట్ల సుహృద్భావన, ఇతరులకు సంబంధించిన దేన్నీ ఆశించకుండా ఉండటం, తనకంటూ, తనదంటూ ఏమీ లేకుండా ఉండటం, బ్రహ్మచర్యాన్ని పాటించటం. యోగమార్గంలో నడవాలంటే వీటన్నిటినీ ఆచరించాలి
- నియమాలు : వ్యక్తి తనని తాను ఎలా తీర్చిదిద్దుకోవాలో నియమాలు తెలుపుతాయి. శౌచ్యము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము ఈ ఐదు నియమాలు.శరీరాన్ని, మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఉన్నదానితో సంతృప్తి చెందటం, అతిసామాన్యమూ, పవిత్రమూ అయిన జీవితాన్ని గడపటం, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటూ దేవుని పట్ల భక్తి కలిగి వుండటము నియమాలు. యమ,నియమాలు వల్ల చిత్త వృత్తులు ఆధీనములో ఉంటాయి.
- ఆసనము: ఏది అయితే స్థిరముగా,సుఖముగా ఉంటుందో అది ఆసనము. శరీరానికి ఇబ్బంది కలగకుండా చక్కగా ధ్యానం లో లగ్నం కావటానికే ఆసనం.
- ప్రాణాయామము : స్థిరంగా కూర్చొని శ్వాస, ప్రశ్వాసలతో కూడిన శ్వాసక్రియాగతిని నియంత్రించటం. దీనిలో చాలా రకాల ప్రాణాయామము ఉన్నాయి. వీటి వల్ల ఏకాగ్రత కోసం శ్వాసని నియంత్రించటం, దాని వల్ల జ్ఞానం వికసించి ధారణకి అవసరమైన యోగ్యంత సిద్ధిస్తుంది.
- ప్రత్యాహారం : ఇంద్రియాలకు సంబంధించిన విషయాల పట్ల, బాహ్యప్రపంచం పట్ల చిత్తం లో సంయోగము చెందకుండా అంతర్ముఖమవటం. ఇంద్రియాలు తమ విషయాలతో సంబంధం కోల్పోయి మనస్సుతో లీనము చెందటమే ప్రత్యాహారం.
- ధారణ : ఏదో ఒక ప్రదేశంలో, శరీరం వెలుపల కానీ, లోపలకానీ చిత్తాన్ని నిలపటం. ఎన్నుకొన్న ప్రదేశం, వస్తువు లేదా మంత్రం పట్ల అవధానం, ఏకాగ్రత.
- ధ్యానం :ఏ విషయం మీద మనస్సు లగ్నంచేశామో దాని కేసి మనస్సు మరలకుండా . అంటే ధారణ స్థితి అవిఛ్చిన్నంగా సాగి చిత్తాన్ని ధ్యేయంతో ఏకాగ్రత పరచటం.
- సమాధి : ధ్యానం ధ్యేయంగా మార్పు చెంది ప్రకాశవంతమైనప్పుడు అంటే ధ్యేయం, ధ్యాతా, ధ్యానం – ఈ మూడింటిలో ధ్యేయ జ్ఞానం మాత్రమే ఉండి మిగిలిన రెండిటి ఎరుకా లుప్తమయిన స్థితి సమాధి. పతంజలి మహర్షి ఎన్నోరకాల సమాధిస్థితుల్ని వర్ణిస్తాడు. సమాధిలో సర్వజ్ఞత, పరమానందము, పరిపూర్ణ జ్ఞానము సిద్ధిస్తాయి. అభ్యాస, వైరాగ్యాలు పతంజలి యోగానికి మూలస్థంభాలు. అకుంఠిత దీక్షతో, నిర్వికారంగా యోగాభ్యాసం చేస్తే ఎవరికైనా చిత్తవృత్తులు నిరోధించబడి, సర్వజ్ఞలా తదుపరి కైవల్యమూ సిద్ధిస్తాయన్నది యోగసూత్రాల ప్రతిపాదన. ఈ యోగ విధానాన్ని రాజయోగమనీ అంటారు.