మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) చర్యలు తీసుకుంది. నిద్రాణ స్థితిలో ఉన్న, క్లెయిమ్ చేసుకోని ఖాతాలను గుర్తించడానికి ఓ కొత్త ప్లాట్ ఫాంను డెవలప్ చేయనుంది. దీని ద్వారా అలాంటి ఖాతాలను చాాలా సులభంగా గుర్తించే వీలుంటుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ (ఎంఐటీఆర్) పేరుతో త్వరలో కొత్త పోర్టల్ అందుబాటులోకి రానుంది. కొత్త ప్లాట్ ఫాంను రిజిస్టర్ అండ్ ట్రాన్స్ ఫర్ ఏజెంట్ (ఆర్టీఏ) డెవలప్ చేయనుంది. కొత్త ఎంటీఆర్ పోర్టల్ ద్వారా ఇన్వెస్టర్లు తమ కేవైసీని అప్ డేట్ చేసుకోవచ్చు. మర్చిపోయిన ఎంఎఫ్ ఆస్తులను వెతకవచ్చు. అలాగే మోసపూరిత రీడిమ్ ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీని ద్వారా పారదర్శక ఆర్థిక వాతావరణం ఏర్పడడంతో పాటు పెట్టుబడిదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కంప్యూటర్ ఎడ్జ్ మెనేజ్ మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (క్యామ్స్), కేఎఫ్ఐఎన్ టెక్నాలజీస్ అనే రెండు అర్హత కలిగిన ఆర్టీఏలు కలిపి కొత్త పోర్టల్ ను నిర్వహించే అవకాశం ఉంది.
గత పదేళ్లు గా ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలను, ఇన్వెస్టర్లు క్లెయిమ్ చేసుకోని వాటిని నిద్రాణ స్థితిలో ఉన్న ఖాతాలుగా వ్యవహరిస్తారు. ఇన్వెస్టర్లు మరణించడం, ఆ ఖాతాలను మర్చిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇటువంటి ఖాతాలను గుర్తించడం ప్రస్తుతం చాలా కష్టం. అందువల్లే సెబీ కొత్త పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆ ఖాతాల డేటాను ఈ కొత్త పోర్టల్ కు లింక్ చేస్తారు. పెట్టుబడిదారులు తమ గుర్తింపును ధ్రువీకరించడం ద్వారా ఖాతాలను కనుగొనే అవకాశం లభిస్తుంది. ముందుగా పెట్టుబడిదారుడు ఈ ప్లాట్ ఫాంలోకి లాగిన్ అవ్వాలి. తన పాన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేయాలి. అనంతరం ఆయన క్లెయిమ్ చేసుకోని ఖాతాల సమాచారం కనిపిస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కొన్ని సార్లు తమ పెట్టుబడులను ట్రాక్ చేయలేకపోతున్నారని సెబీ గుర్తించింది. కేవైసీ వివరాలు సక్రమంగా లేకపోవడం, ఫిజికల్ గా ఇన్వెస్ట్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. పాన్, ఇమెయిల్ ఐడీ, చిరునామా, ఖాతాల వివరాలు కూడా కనిపించవు. అందువల్ల కొన్నిసార్లు ఎంఎఫ్ ఖాతాలు పనిచేయకుండా ఉంటాయి. వాటిని అలాగే వదిలేస్తే మోసపూరిత ఎన్ క్యాష్ మెంట్ కు గురవుతాయి.
సెబీ తీసుకురానున్న కొత్త ఎంఐటీఆర్ ప్లాట్ ఫాంతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. క్లెయిమ్ చేయని ఎంఎఫ్ ల డేటా అంతా దీనిలో కనిపిస్తుంది. పాత ఇన్వెస్టర్లు కూాడా చాలా సులభంగా వాటిని గుర్తించగలరు. అలాగే ఏ సమయంలోనైనా తమ స్టేటస్ ను పరిశీిలించుకోవచ్చు. ఇన్ యాక్టివ్ ఖాతాల మోసాల నుంచి బయటపడవచ్చు. క్లెయిమ్ చేయని ఖాతాల్లో ఉన్న నిధులను తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి