Mysterious Deaths: గజ గజ.. వరుస మరణాలతో స్మశానంగా మారుతున్న గ్రామం.. వామ్మో.. ఏం జరుగుతోంది..

Mysterious Deaths: గజ గజ.. వరుస మరణాలతో స్మశానంగా మారుతున్న గ్రామం.. వామ్మో.. ఏం జరుగుతోంది..


ప్రకృతి అందాలకు నెలవైన జమ్ము-కాశ్మీర్‌లో ఓ గ్రామం ఇప్పుడు అంతుచిక్కని మరణాలతో కలకలం రేపుతోంది. కేవలం 45 రోజుల వ్యవధిలో 17 మంది ప్రాణాలను అంతుచిక్కని రుగ్మత బలితీసుకుంది. ఇంకా చాలా మంది ప్రాణాపాయ స్థితిలో జమ్ములోని ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ మరణాల మిస్టరీ తేల్చేందుకు కేంద్ర హోంశాఖ వివిధ మంత్రిత్వ శాఖలతో కలిపి ఒక బృందాన్ని రాష్ట్రానికి పంపించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆరోగ్య శాఖ, పోలీసు శాఖలతో విచారణ జరిపిస్తోంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరీ జిల్లాలో బుధాల్ గ్రామం ఈ అంతుచిక్కని మరణాలకు నిలయంగా మారింది.

ఎలా మొదలైంది?

గత ఏడాది (2024) డిసెంబర్ 7న ఈ మరణ మృదంగం మోగింది. సామూహిక భోజనాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురవగా, వారిలో ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత డిసెంబర్ 12న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది అస్వస్థతకు గురికాగా, ముగ్గురు ప్రాణాలు విడిచారు. మూడవ ఘటన జనవరి 12న నమోదైంది. ఒక కుటుంబానికి చెందిన 10 మంది సామూహిక భోజనాల్లో అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురు చిన్నారులు జమ్ములోని SMGS ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. గురువారం పదేళ్ల జబీనా కౌసర్ చనిపోయింది. ఆమె సోదరి 15 ఏళ్ల యస్మీన్ కౌసర్ చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచింది. ఈ మరణంతో మొత్తం మృతుల సంఖ్య 17కు చేరింది.

విచారణలో ఏమైనా తేలిందా?

వరుసగా నమోదవుతున్న మిస్టరీ మరణాలపై వైద్యారోగ్య శాఖకు చెందిన అధికారులు విచారణ చేపట్టారు. గ్రామంలోని 3,000 మందిని ఇంటింటికీ వెళ్లి సర్వే చేశారు. అక్కడ నీరు, ఆహారం సహా వివిధ రకాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్ టెస్టులకు పంపించారు. ఇన్‌ఫ్లూయెంజా తరహా ఆనవాళ్లు లేదా నీరు, ఆహారం కలుషితమైన దాఖలాలేవీ ఆ టెస్ట్ రిపోర్టుల్లో కనిపించలేదు. దాంతో మరింత అడ్వాన్స్‌డ్ పరీక్షల కోసం ప్రఖ్యాత జాతీయ సంస్థలు ICMR, నేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), CSIR, DRDO, PGIMER-చండీగఢ్ వంటి సంస్థలు రంగంలోకి దిగి నిర్వహించిన పరీక్షల్లోనూ అనుమానించదగ్గ ఆనవాళ్లు ఏవీ లభించలేదు. మరణాలకు దారితీసిన కారణాలు కూడా తెలియలేదు.

చనిపోయినవారంతా 1.5 కి.మీ పరిధిలో నివసించే 3 కుటుంబాలకు చెందినవారని పోలీసుల విచారణలో తేలింది. అంతకు మించి మరణాల వెనుక కారణమేంటి అన్నది పోలీసుల కోణంలోనూ ఎలాంటి ఆధారం లభించలేదు. అయితే మొదటి మరణం సంభవించినప్పటి నుంచి గ్రామంలో వైద్య సిబ్బంది అంబులెన్సులతో పాటు అందుబాటులో ఉన్నారు. చనిపోయిన 3 కుటుంబాలకు చెందిన ఇళ్లకు తాళాలు వేశారు. వారితో బంధుత్వాలు, సంబంధాలు కలిగిన 21 మందిని ప్రభుత్వ వసతి గృహాలకు తరలించి అబ్జర్వేషన్లో ఉంచారు. మరోవైపు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తితే వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. అంతుచిక్కని అనారోగ్యంతో మరణించినవారికి CSIR-IITR అటాప్సీ (శవ పరీక్ష) నిర్వహించింది. మృతదేహాల్లో న్యూరోటాక్సిన్స్ ఉన్నాయని అటాప్సీ రిపోర్టులో తేలింది. మరోవైపు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ఇంటర్‌-మినిస్టీరియల్ టీమ్ కూడా ఈ అంశంపై విచారణ జరుపుతోంది. ఈ బృందంలో హోంశాఖతో పాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, రసాయనాలు ఎరువుల శాఖ, నీటి వనరుల శాఖకు చెందిన నిపుణులు ఉన్నారు.

స్మశానంగా మారుతున్న గ్రామం

అంతుచిక్కని వరుస మరణాలతో గ్రామం స్మశానంగా మారుతోంది. జనవరి 12-17 తేదీల మధ్య తన ఐదుగురు పిల్లలు, మేనమామ – అత్తలను కోల్పోయిన మహ్మద్ అస్లాం తన వ్యవసాయ భూమిలో సమాధులు నిర్మించారు. ఇప్పుడు మిగిలిన ఏకైక కుమార్తె యస్మీనా జాన్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అంతకంటే ముందు డిసెంబర్ 12న అస్లాం కజిన్ సోదరుడు మహ్మద్ రఫీఖ్ తన గర్భవతి భార్యతో పాటు ముగ్గురు చిన్నారులను కోల్పోయాడు. వరుస మరణాలతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామస్థులు పెళ్లి భోజనాలు సహా సామూహిక భోజనాలు చేయాలంటే వణికిపోతున్నారు. మరోవైపు ఈ మూడు కుటుంబాలు మినహా మిగతా గ్రామవాసుల్లో మరెవరూ అస్వస్థతకు గురికాకపోవడం ఉపశమనం కల్గించే అంశం.

ఈ న్యూరో టాక్సిన్లు అంటే ఏంటి?

వరుస మరణాలకు స్పష్టమైన కారణం తెలియకున్నా అటాప్సీ నివేదిక మాత్రం మృతదేహాల్లో న్యూరోటాక్సిన్లు ఉన్నాయని చెబుతోంది. న్యూరోటాక్సిన్ అనేది నాడీ కణాలను (న్యూరాన్లు) దెబ్బతీయడం లేదా బలహీనపరచడం ద్వారా నాడీ వ్యవస్థ యొక్క సాధారణ పనితీరును దెబ్బతీసే విష పదార్థం. న్యూరోటాక్సిన్లు మెదడు, వెన్నెముకతో పాటు నరాలను ప్రభావితం చేస్తాయి. ఈ టాక్సిన్ రకాలు, తీవ్రతను బట్టి వివిధ రకాల లక్షణాలతో మనిషి తీవ్ర అనారోగ్యం పాలవుతాడు. ప్రాణాలు కూడా కోల్పోతాడు.

ఈ పదార్థాలు బ్యాక్టీరియా, మొక్కలు లేదా జంతువులు వంటి సహజ జీవుల ద్వారా తయారవుతాయి. లేదా సింథటిక్ రసాయనాల ద్వారా కూడా తయారు చేయవచ్చు. గ్రామంలో మరణాలు న్యూరోటాక్సిన్ల వల్ల సంభవించాయని ఆరోగ్య శాఖ నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) రాజౌరి ప్రిన్సిపాల్ డాక్టర్ AS భాటియా మాట్లాడుతూ మరణించిన వ్యక్తులంతా దాదాపు ఒకే రకమైన లక్షణాలను ప్రదర్శించారని చెప్పారు. వాటిలో మెదడు వాపు లేదా ఎడెమా వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయని అన్నారు. దేశంలోని అగ్రశ్రేణి ప్రయోగశాలలు విశ్లేషించిన నమూనాలలో న్యూరోటాక్సిన్లు ఉన్న విషయం బయటపడిందని, మెదడు దెబ్బతినడానికి అవే కారణమయ్యాయని డాక్టర్ భాటియా వివరించారు. మెదడుకు జరిగే నష్టాన్ని తాము కొంతమేర మాత్రమే అడ్డుకోగలమని, రోగి మెదడు తీవ్రంగా దెబ్బతిన్నట్టయితే ప్రాణాలు కాపాడ్డం అసాధ్యమని వెల్లడించారు. వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయని, ఇవి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తొలుత ఆందోళన చెందినప్పటికీ, మరణాలకు కారణం వైరస్, బ్యాక్టీరియా కారణం కాదని, అంటువ్యాధిలా విస్తరించే ప్రమాదం లేదని NCDC, NIV సంస్థలు తమ ల్యాబ్ టెస్టుల అనంతరం తేల్చాయి. కేవలం న్యూరోటాక్సిన్లే అక్కడి వ్యక్తుల మరణాలకు కారణమవుతున్నాయని తేలింది. అవి ఎలా ఉత్పత్తి అయ్యాయి… గ్రామస్తుల శరీరాల్లోకి ఎలా చేరాయి అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *