
న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 ప్రారంభానికి ముందు, స్పోర్ట్స్ ఎడిటర్ మేహా భరద్వాజ్ ఆల్టర్ లెజెండరీ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌తో మాట్లాడారు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఎలా ప్రారంభమైందో, సైనా నెహ్వాల్, పీవీ సింధు ఎలా ఛాంపియన్లుగా ఎదిగారో ఆయన వివరించారు. ప్రతిభావంతులైన ఆటగాడిని గొప్ప ఆటగాడిగా మార్చే సూత్రాన్ని గోపీచంద్ చెప్పాడు. అలాగే హైదరాబాద్‌లో తన అకాడమీని నిర్మించడానికి తాను చేసిన త్యాగాలను కూడా గోపీచంద్ వెల్లడించారు.
‘ఇది నాకు ఒక ప్రయాణం. ప్రారంభంలో, నేను క్రీడలను కెరీర్‌గా ఎంచుకోగలనో లేదో నాకు కూడా తెలియదు. కానీ కాలం గడిచేకొద్దీ నేను ఆడటం ప్రారంభించే కొద్దీ, కోర్టులు, షటిల్‌ల లభ్యత, జిమ్, రికవరీ, ఆహారం, వసతి… వంటి ప్రాథమిక విషయాల కోసం మనం ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నామో నేను గ్రహించాను. నేను స్పోర్ట్స్ న్యూట్రిషన్, ఫిజియాలజీ, సైకాలజీ, బయోమెకానిక్స్ గురించి కూడా మాట్లాడటం లేదు. నేను బ్యాడ్మింటన్ టోర్నీల కోసం ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్లాను. అక్కడితో పోల్చుకుంటే.., మనకు కోచింగ్, ప్రాథమిక సదుపాయాలు ఎంత తక్కువగా ఉన్నాయో అర్థమైంది. అకాడమీ ఆలోచన 2003 లో వచ్చింది. చివరకు 2007లో నా కల సాకరమైంది. అకాడమీని నెలకొల్పడంతో నాకు చాలా మంది మద్దతుగా నిలిచారు. క్రీడలలో సెలవులు లేదా వారాంతాలు ఉండవు. . 2007 లో అకాడమీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు, కోర్టు లేదా మరే ఇతర లోపం కారణంగా మేము ఏ సెషన్‌ను నిలిపివేయవలసి రాలేదని పూర్తి నమ్మకంతో చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ఎవరికైనా ఆడాలనే కోరిక, ఏదైనా సాధించాలనే సంకల్పం ఉంటే చాలు.. మేం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం. కోచ్, ఫిజియో, ట్రైనర్ ఇలా అందరి సహకారంతో క్రీడాకారులను మెరికల్లా తయారు చేస్తాం’
నా దృష్టిలో మంచి కోచ్ అంటే..
‘నేను ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచినప్పుడు, నేనే కాదు.. ఏ భారతీయుడైనా గెలవగలడనే నమ్మకం కలిగింది. అదే నమ్మకంతో నేను ఈ ప్రయాణాన్ని ప్రారంభించాను. నా తర్వాత సైనా నెహ్వాల్, పివి సింధు, శ్రీకాంత్, సాత్విక్… ఇలా ఎంతో మంది క్రీడాకారులు మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చారు.
‘కాలంతో పాటు నన్ను నేను మార్చుకున్నాను. గతంలో నేను కోచ్, ట్రైనర్, ప్రతిదీ. నేనే పిల్లలను నిద్ర లేపి, గదిలో బిస్కెట్లు లేదా చాక్లెట్లు ఉన్నాయా అని చూసేవాడిని. కానీ ఇప్పుడు మనకు కోచ్‌లు, ట్రైనర్లు, ఫిజియోలు, మెంటల్ ట్రైనర్లు మొదలైనవారు ఉన్నారు. నా దృష్టిలో మంచి కోచ్ అంటే తనకు అప్పగించిన పనిని బాధ్యతతో పూర్తి చేసేవారు. అందుకోసం అతను కఠినంగా ఉంటాడా? లేదా సాఫ్ట్ గా వ్యవహరిస్తాడా? అన్నది సంబంధం లేని విషయం’ అని తన అకాడమీ గురించి చెప్పుకొచ్చాడు గోపీచంద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..