
ఆహార ఉత్పత్తులు, మేకప్-స్కిన్ కేర్ ఉత్పత్తులు, మందులు.. ఇలా దాదాపు అన్ని ప్రొడక్ట్స్‌కి గడువు తేదీ ఉంటుంది. గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగిస్తే ఖచ్చితంగా సమస్యను ఎదుర్కొవల్సి వస్తుంది. అందుకే మార్కెట్లో కొనుగోలు చేసే ఏ ఉత్పత్తి అయినా దాని గడువు తేదీని ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి. కానీ మీకు తెలుసా? కొన్ని ఆహార పదార్థాలకు గడువు తేదీ ఉండదు. ఇలా గడువు తేదీ లేని ఆహారాలు ఏమిటో ఇక్కడ చూద్దాం..
గడువు తేదీ లేని ఆహారాలు ఇవే
తేనె
స్వచ్ఛమైన తేనె ఎప్పుడూ చెడిపోదు. తేనె హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బ్యాక్టీరియా, కీటకాల పెరుగుదలను నిరోధిస్తుంది. అలాగే దానిలో తక్కువ నీటి శాతం బ్యాక్టీరియా మనుగడకు అనుకూలం కాదు. మీరు తేనెను గాలి చొరబడని సీసా లేదా కంటైనర్‌లో ప్యాక్ చేసి మీకు కావలసినప్పుడల్లా ఎన్నాళ్లైనా దాచుకుని తినవచ్చు. గాజు సీసాలలో నిల్వ చేస్తే, దీనిని చాలా సంవత్సరాలు ఉపయోగించవచ్చు. కాలక్రమేణా దాని నాణ్యత క్షీణించినప్పటికీ, ఇది తినడానికి పూర్తిగా సురక్షితం.
ఉప్పు
ఆహార పదార్థాల రుచిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించే ఉప్పుకు గడువు తేదీ ఉండదు. ఉప్పును సరిగ్గా నిల్వ చేస్తే అది చెడిపోదు. ఉప్పులోని సోడియం క్లోరైడ్ స్థిరమైన రసాయన సమ్మేళనం. ఇది ఉప్పు చెడిపోకుండా నిరోధిస్తుంది. మీరు గాలి చొరబడని గాజు పాత్రలో ఉప్పును నిల్వ చేయవచ్చు.
చక్కెర
చక్కెర ఎప్పుడూ చెడిపోదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చక్కెరను తేమ నుండి దూరంగా ఉంచితే, మీరు దానిని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. గాలి చొరబడని గాజు పాత్రలో చక్కెరను నిల్వ చేయడం మంచిది. చక్కెర పాత్రను ఎల్లప్పుడూ తేమ, వేడి నుంచి దూరంగా ఉంచాలి. ఇది చక్కెరను ఎక్కువ కాలం నిల్వ ఉంచడంలో సహాయపడుతుంది.
బియ్యం
బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలలో ఒకటి. దీనికి కూడా గడువు తేదీ ఉండదు. అందుకే బియ్యం పాతబడితే, మరింత రుచిగా మారుతుందని పెద్దలు అంటారు. అయితే బియ్యం నాణ్యత మనం దానిని నిల్వ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది.
వెనిగర్
వెనిగర్ అనేది ఒక వంట పదార్థం. దీనిని ఊరగాయలు సహా అనేక వంటలలో ఉపయోగిస్తారు. వీటికి కూడా గడువు తేదీ ఉండదు. సరిగ్గా నిల్వ చేస్తే, అవి ఎక్కువ కాలం చెడిపోవు.
ఆల్కహాల్
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ, దానికి గడువు తేదీ ఉండదు. అందుకే అది ఎంత పాతదైతే, అంత రుచిగా ఉంటుందని అంటారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.