Pawan kalyan: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో భేటీ

Pawan kalyan: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో భేటీ


ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నాన్‌స్టాప్ భేటీలతో బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, సీఆర్‌ పాటిల్‌, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధించిన కీలక అంశాలను షెకావత్‌ వద్ద ప్రస్తావించారు. టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ లాంటి అనేక అంశాలపై మాట్లాడినట్లు చెప్పారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు రైల్వేమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురంకు మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దఎత్తున వస్తుంటారని, పిఠాపురం మీదుగా వెళ్లే రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలని మంత్రిని కోరారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా తాను ఈ మేరకు హామీ ఇచ్చామన్నారు.

ఏపీలో 7వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని, గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్‌ చెల్లించకపోవడంతో గడువు ముగిసిందని, కాలపరిమితిని రెండేళ్లు పెంచాలని ఆర్థిక మంత్రిని పవన్‌కల్యాణ్ కోరారు. ఢిల్లీలో మీడియాతో అనేక అంశాలపై స్పందించారు. జగన్‌కు అదానీ ముడుపులిచ్చారన్న వ్యవహారంపై ప్రశ్నించగా.. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మపై నమోదైన కేసుల విషయంలో పవన్‌కల్యాణ్ కూడా ఆచితూచి స్పందించారు. తమను ఇబ్బంది పెట్టినవారిని అరెస్టు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందో కనుక్కుంటానన్నారు. గత ప్రభుత్వంలో కనీస జవాబుదారీతనం, పారదర్శకత లేవని విమర్శించారు. ఢిల్లీ టూర్‌లో పవన్ వెంట పాటు జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. బుధవారం ప్రధాని మోదీని పవన్ కలుస్తామన్నారు. ఒక్కరోజే నలుగురు కేంద్ర మంత్రుల్ని కలిశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *