పెద్దాపురంలో జంకు బొంకు లేకుండా.. వ్యభిచారం సాగుతోంది. ఎప్పుడో రూపు మారిపోయిందనుకున్న పడుపు వృత్తి మళ్లీ బుసలు కొడుతోంది. పెద్దాపురం వీధులు ఇప్పుడు రెడ్‌లైట్ ఏరియాలను తలపిస్తున్నాయి. ఒకప్పుడు పెద్దాపురం ఎలా ఉండేదో… మళ్లీ ఆ పెద్దాపురంలా మార్చేస్తున్నారు కొందరు పడుపు వ్యాపారులు.
తెలుగు సినిమాల్లో పెద్దాపురం ప్రస్తావన వచ్చిందంటే.. అది డబుల్ మీనింగ్ కోసమే అనుకోవాలి. పెద్దాపురం నుంచి వచ్చిన మహిళలంటే కనీస గౌరవం లేకుండా ఉన్న సీన్లు కూడా ఉన్నాయి. ఇక వ్యభిచారం ప్రస్తావన వచ్చిందంటే.. మీది పెద్దాపురమా అని అడుగుతారు. పెద్దాపురానికి.. వ్యభిచారానికి ఎంత పెనవేసుకుపోయిన బంధం ఉండేదో ఈ సినిమా సీన్లను బట్టే అర్ధం చేసుకోవచ్చు. అయితే 15ఏళ్లక్రితం జరిగిన సంస్కరణలు.. ప్రభుత్వ చర్యలతోపాటు.. సోషల్ వర్కర్లు.. మతపెద్దలు అంతా కలిసి పెద్దాపురాన్ని మార్చేశారు. ప్రాస్టిట్యూషన్ అనేది వినిపించకుండా చేశారు. పడుపు వృత్తిని వ్యాపారంగా మార్చిన వారంతా చెల్లాచెదురయ్యారు. కాని.. రోజులు గడిచేకొద్దీ.. పెద్దాపురం మళ్లీ పూర్వస్థితికి చేరుకుంది. ఇప్పుడు పెద్దాపురం గతంకన్నా ఘోరంగా కనిపిస్తోంది.
రెడ్‌లైట్ ఏరియాలను తలపించే వీధులు. ఇళ్ల ముందు వేచిచూసే మఘువలు. వీధుల నుంచి వెళ్తుంటే కైపుగా పిలిచే మహిళలు.. ఇదీ ఒకప్పటి పెద్దాపురం. తరతరాలుగా వచ్చే పడుపు వృత్తిలోనే ఉండే మహిళలు బయటపడలేక ఎంతో వ్యథను అనుభవించేవారు. వారి శరీరాలతో వ్యాపారం చేసి కోట్లలో ఆర్జించిన వారున్నారు. అయితే ఇలాంటి వ్యాపారులకు కొన్నేళ్ల క్రితం పోలీసులు చెక్పెట్టినా.. మళ్లీ ఇక్కడకు వచ్చి చేరిపోయారు. ఐదేళ్లుగా ఇక్కడ వ్యభిచార వృత్తి మళ్లీ పడగ విప్పి బుసలు కొడుతోంది. వ్యభిచార గృహాల నిర్వాహకులు వేరే ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా ఇక్కడ బహిరంగంగా వ్యభిచారం చేయించడం ఒక ఎత్తయితే… తమ వ్యాపారానికి అడ్డు వచ్చిన వారిపై దాడి చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి.. పెద్దాపురంలోని ఒక వీధి ఇది. రండి పర్వాలేదు ఎవరూ రారు ఇక్కడ అంతా సేఫ్ అని.. ఒక మహిళ చెబుతోంది అంటే.. ఇక్కడ విచ్చలవిడి శృంగారం ఎంత ఎత్తున ఎగసిపడుతోందో మీ ఊహలకే వదిలేస్తున్నాం.
మినిమం 500 నుంచి వెయ్యిరూపాయలు. గంట సేపు గడిపితే 3వేలవరకు వసూలు. అదే అమ్మాయిని బయటకు తీసుకెళ్తే 6 నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారు. వారి బేరాలన్నీ టీవీ9 నిఘా నేత్రానికి చిక్కాయి.
మా ప్రతినిధులు నిఘా కెమెరాలతో.. ఓ ఇంటికి వెళితే దారుణమైన పరిస్థితి కనిపించింది. టీనేజ్ అమ్మాయిలు.. 20 ఏళ్లలోపు అమ్మాయిలే కనిపించారు. ఇలా పెద్దాపురంలో ఎన్నో ఏళ్లుగా వ్యభిచారం చాపకింద నీరులా పాకిపోతోంది. చాలామంది అమ్మాయిల్ని బయట నుంచి తీసుకొచ్చి.. వ్యాపారం జరిగాక.. వారి అందం వాడిపోయాక, డబ్బులు ఇవ్వకుండా బయటికి గెంటేసిన దాఖలాలు ఉన్నాయి. ఒకానొక దశలో భర్తను వదిలేసిన మహిళలని టార్గెట్ చేసి పెద్దాపురంలోనే ఇంట్లో పనికని తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించిన పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. అయినా సరే మేము ఎవరినీ లెక్కచేయము. మా వ్యాపారం మాది అంటున్నారు కొంతమంది వ్యభిచార గృహాల నిర్వాహకులు. లోపలికి రండి రేటు మాట్లాడుకోండి ఆనందంగా ఉండండి సైలెంట్ గా వెళ్ళిపొండి పెద్దాపురం ఏ వీధిలోకి వెళ్లినా.. ఇదే మాట వినిపిస్తోంది. ఇంత జరుగుతున్నా.. పోలీసులు కన్నెత్తి కూడా చూడడం లేదు.
పెద్దాపురంలో అంతా కలర్‌ఫుల్లే.. రంగురంగుల దుస్తులు వేసుకున్న మహిళలు.. కలర్‌ఫుల్ ఎల్ఈడీ లైట్లతో రూమ్‌లు.. ఫ్యాన్సీ బెడ్లు.. రూముల్లో విటులకు కావాల్సిన కాస్ట్లీ మందు. ఇలా రంగులలోకాన్ని అక్కడ ఆవిష్కరిస్తున్నారు. కొన్నిసార్లు పోలీస్ రెయిడ్లు జరిగినా.. కనపడకుండా.. ఒక గదిలోనుంచి.. మరో సీక్రెట్ గది నిర్మించడం జరుగుతోంది. ఇది పెద్దాపురంలో పడుపు వ్యాపారం పరిస్థితి. ఈ వ్యాపారం ఎంత వేళ్లూనుకుపోయిందంటే.. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం.. వినకపోతే హత్యలకు కూడా పాల్పడుతున్నారు వ్యాపారులు. ఇలాంటి ఘటనలతో.. పోలీస్ స్టేషన్లో PITA యాక్ట్, హత్య, దాడులు కేసులు రోజుకోటి వస్తున్నాయి. స్థానికంగా ఉండే సిమ్మ సన్నీ వర్గం మిగిలిన వారిపై కేసులు పెట్టించడం మిగిలిన వారు సన్నీ వర్గంపై కేసులు పెట్టుకోవడం ప్రస్తుతం పెద్దాపురంలో హాట్ టాపిక్ గా మారింది. ధరణికోట నీలిమ అనే మహిళ అనకాపల్లికి చెందిన ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తన కుమారుడితో వివాహం చేశారు. ఆతర్వాత ఆమెను పెద్దాపురంలోని సిమ్మా రాజుకి చెందిన ఇంట్లో పెట్టి బలవంతంగా వ్యభిచారం చేయించడంతో తీవ్ర అనారోగ్యం పాలైన బాలిక పుట్టింటికి పారిపోయి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమెను విశాఖ కేజీహెచ్‌లో రెండు నెలల పాటు ఉంచి చికిత్స అందించారు. దీనిపై పెద్దాపురంలో కేసు నమోదై తల్లి కొడుకులను అరెస్టు చేశారు పోలీసులు.
కాకినాడకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి సిమ్మా సన్నీ ఇంటికి వచ్చి అమ్మాయిల కోసం ఆరాతీశాడు. ఇది కాస్తా పెద్ద గొడవ కావడంతో.. సన్నీ అతని భార్య నాగలక్ష్మి… సిమ్మా వెంకీ అతని భార్య బాపనమ్మలు సుబ్బారెడ్డిని క్రూరంగా కొట్టి చంపి శవాన్ని ఊరి చివర రైస్ మిల్లు వెనుక ఖాళీ స్థలంలో పడేశారు. శవాన్ని తీసుకెళ్లేందుకు సహకరించిన వ్యక్తులు పోలీసుల వద్ద లొంగి పోవడంతో సన్నీ అండ్ కో వ్యవహారం బయటకు వచ్చింది.
2022లో సిమ్మా సన్నీ… సిమ్మా బాపనమ్మ, దుక్కా నాగమణికి చెందిన మూడు వ్యభిచార గృహాలను ఆర్డీవో ఆదేశాలతో పోలీసులు సీజ్ చేశారు. కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకుని మళ్లీ అవే ఇళ్లల్లో వ్యభిచారం యదేచ్ఛగా జరిగిస్తున్నారు. బ్రోతల్ దందా సాగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి మాత్రమే బ్రోతల్ హౌస్ లపై కేసు నమోదు చెయ్యాలనే విషయం తెల్సిన నిర్వాహకులు కింది స్థాయిలో ఎవరు వచ్చినా.. మీరు మమ్మల్ని ఏం చేయలేరని బహిరంగంగా వార్నింగ్ ఇచ్చిపంపుతున్నారు. పోలీసులు తిరగబడితే.. కక్షకట్టి వ్యభిచారం చేసే అమ్మాయిలతో తప్పుడు కేసులు పెట్టీ పంపించేస్తున్నారు. అయితే పెద్దాపురంలో బ్రోతల్ హౌస్ ల పై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు వారు పెట్టే కేసులకు భయపడి మనకెందుకులే అని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సన్నీ అండ్ కో ఆగడాలు రోజు రోజుకు శృతిమించి పోతున్నాయి.