ప్రధాని మోదీ, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మెన్ మధ్య ఆసక్తికరమైన పాడ్‌కాస్ట్ ఒకటి సాగింది. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ పాడ్‌కాస్ట్‌లో మోదీ తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను, చిన్ననాటి అంశాలను పంచుకున్నారు. అలాగే భారత్ శాంతి అన్వేషణ, పాకిస్తాన్‌తో సంబంధాలతో సహా అనేక అంశాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. భారతదేశం శాంతి గురించి మాట్లాడినప్పుడల్లా ప్రపంచం దాని మాట వింటుందని. ఎందుకంటే ఇది గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ పుట్టిన భూమి. ప్రకృతితో లేదా ప్రపంచ దేశాలతో భారతదేశం ఎప్పుడూ ఎలాంటి వైరాన్ని కోరుకోదని ప్రధాని మోదీ అన్నారు.
‘మనం శాంతి గురించి మాట్లాడినప్పుడల్లా ప్రపంచం భారత్ మాట వింటుంది. ఎందుకంటే ఇది గౌతమ్ బుద్ధా, మహాత్మా గాంధీ పుట్టిన భూమి. మనది సామరస్యాన్ని సమర్థించే దేశం. ప్రకృతితో లేదా దేశాల మధ్య కలహాలు కోరుకోం. మనం శాంతిని నెలకొల్పేవారిగా వ్యవహరించగలిగిన చోట, ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించాం’ అని ప్రధానమంత్రి అన్నారు. తన బలం మోదీ కాదు, దేశంలోని 1.4 బిలియన్ ప్రజలు. తాను ప్రపంచ నాయకులతో కరచాలనం చేసినప్పుడల్లా, కరచాలనం చేసేది మోదీ కాదు, భారతదేశ ప్రజలే. తను ఎక్కడికి వెళ్ళినా, వేల సంవత్సరాల అనాదిగా సంస్కృతి, వారసత్వాన్ని తనతో తీసుకువెళతానని ప్రధాని మోదీ అన్నారు. వేల సంవత్సరాల వేద సంప్రదాయం, స్వామి వివేకానంద బోధనలను తనతో ప్రతీ చోటకు తీసుకెళ్తానని ప్రధాని మోదీ అన్నారు.