కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కొత్త దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, పాత కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసిన వారికి కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు కోటి రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కొత్తగా అందించనున్న రేషన్ కార్డులను ప్రత్యేకంగా రూపొందించారు.
పోస్ట్‌కార్డు సైజులో ఉండేలా కొత్త కార్డుల ప్రింటింగ్ లో ప్రభుత్వ లోగో తోపాటు.. ముఖ్యమంత్రి, పౌరసరఫరాల మంత్రి ఫొటోను కూడా ముద్రిస్తారు. రేషన్ కార్డుల వ్యవస్థలో మార్పులు రానున్నాయని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు కొత్తగా క్యూ ఆర్ కోడ్ విధానాన్ని కూడా తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులను వారి ఆర్థిక స్థితిని ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి బీపీఎల్ (బిలో పొవర్టీ లైన్) కార్డులు, దాని ఎగువన ఉన్న వారికి ఏపీఎల్ (అబోవ్ పొవర్టీ లైన్) కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. బీపీఎల్ కార్డులను ట్రైకలర్‌లో, ఏపీఎల్ కార్డులను గ్రీన్ కలర్‌లో అందించే యోచన ప్రభుత్వంలో ఉందన్నారు.
రేషన్ షాపుల్లో బార్ కోడ్ స్కానింగ్, బయోమెట్రిక్ విధానం ద్వారా నిత్యావసర సరఫరా సౌలభ్యం కల్పించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. రేషన్ షాపు నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, అడ్రస్ తదితర సమాచారంతోపాటు, ఆధునిక సాంకేతికతగా బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ పొందుపరిచే యోచనలో ఉన్నారు. ఈ విధానం అమలులోకి వస్తే పారదర్శకత పెరిగి, అనర్హులకు రేషన్ సరఫరా నివారించేందుకు వీలవుతుంది. అలాగే ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను మహిళల పేరుమీద అందజేస్తోంది. అదే విధంగా, రేషన్ కార్డులను కూడా గృహిణి పేరుమీద జారీ చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ద్వారా కుటుంబాలకు సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..