School Education: ‘పాఠశాల విద్యలో ఒకే యాప్‌.. బడుల్లో ఏకోపాధ్యాయుల సంఖ్యను తగ్గించాలి’ మంత్రి లోకేశ్‌ ఆదేశం

School Education: ‘పాఠశాల విద్యలో ఒకే యాప్‌.. బడుల్లో ఏకోపాధ్యాయుల సంఖ్యను తగ్గించాలి’ మంత్రి లోకేశ్‌ ఆదేశం


అమరావతి, ఫిబ్రవరి 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఏకోపాధ్యాయుల సంఖ్యను క్రమంగా తగ్గించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అధికారులను ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఇప్పుడున్న 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్‌ తీసుకురావాలని అన్నారు. ఇటీవల పాఠశాల విద్య, సమగ్ర శిక్షా అభియాన్‌పై నిర్వహించిన సమీక్షలో మంత్రి ఈ మేరకు మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన, హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్‌ మేనేజర్ల లాంటి వ్యవస్థను తీసుకురావాలని అధికారులకు సూచించారు. క్లస్టర్‌ స్థాయిలో సీఆర్పీలను వినియోగించుకోవాలని, పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అన్ని అంశాలూ ఏకీకృతం చేసేలా ఒకే డ్యాష్‌బోర్డును రూపొందించాలన్నారు.

మంత్రి నుంచి క్షేత్రస్థాయి వరకు లాగిన్‌లు రూపొందించాలని సూచించారు. అలాగే జీఓ-117 ఉపసంహరణ తర్వాత ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను గరిష్ఠ స్థాయిలో ఏర్పాటు చేసి, తరగతికి ఒక టీచర్‌ చొప్పున కేటాయించాలన్నారు. క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కంప్యూటర్‌ ల్యాబ్, స్టెమ్‌ ల్యాబ్‌లు, లైబ్రరీలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఫిబ్రవరి 28 నుంచి డీఎస్సీ కొత్త టీచర్లకు శిక్షణ: పాఠశాల విద్యాశాఖ

తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది అక్టోబరులో డీఎస్సీ ద్వారా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఎస్‌జీటీలకు 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు మూడు రోజులు, స్కూల్‌ అసిస్టెంట్లకు మార్చి 4 నుంచి 6 వరకు, స్పెషల్‌ ఎడ్యుకేటర్లకు మార్చి 10 నుంచి 12వ తేదీ వరకు శిక్షణ ఇస్తారు. ఈ మేరకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్, పరీక్షలు, విద్యా ప్రమాణాలు, యూడైస్, డిజిటల్‌ పాఠాలు తదితర 11 అంశాలపై మొత్తం 8 వేల మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *